దాడి చేశానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం

13 Aug, 2019 12:22 IST|Sakshi
మాట్లాడుతున్న రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి,  చిత్రంలో వైఎస్సార్‌సీపీ నాయకులు

సాక్షి, నెల్లూరు : డోలేంద్ర ప్రసాద్‌పై తాను దాడి చేశానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. నెల్లూరులోని రూరల్‌ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 11వ తేదీ రాత్రి తాను డోలేంద్ర ప్రసాద్‌పై దాడి చేసి, ఎవరినో కిడ్నాప్‌ చేశానని కేసు నమోదు చేయించారని, అప్పుడు తాను మద్యం మత్తులో ఉన్నానని చెప్పడం జరిగిందన్నారు. తనకు ప్రసాద్‌ 1981 సంవత్సరం నుంచి తెలుసన్నారు. 

రెండు విషయాల్లో విభేదాలు
తనకు డోలేంద్ర ప్రసాద్‌కు రెండు విషయాల్లో విభేదాలు వచ్చాయన్నారు. ఎన్నికలకు మూడునెలల ముందు డోలంద్ర నా వద్దకు వచ్చారని ఎమ్మెల్యే వెల్లడించారు. ‘చంద్రబాబుతో అంతా మాట్లాడాను. నేను చెప్పినట్లే సీట్లు ఇస్తామన్నారు. టీడీపీలో చేరి రూరల్‌ నుంచి పోటీ చేయి. ఖర్చంతా చంద్రబాబే చూసుకుంటారు. ఈసారి టీడీపీ ప్రభుత్వమే వస్తుంది’ అని డోలేంద్ర తనకు చెప్పారన్నారు. తాను దీనిని వ్యతిరేకించి రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని, ఆయనతోనే నా ప్రయాణం తప్ప, ఇంకో పార్టీ మారేది లేదని తెగేసి చెప్పానని కోటంరెడ్డి తెలిపారు. అలాగే ‘కస్తూరీదేవి స్కూల్‌ విషయలో తనను ఉద్యమం చేయమన్నారు. అయితే ఉద్యమం చేసేందుకు అక్కడేముందని అడిగాను. జీవీకే సంస్థ కూడా స్కూల్‌లో జీతాలు, కార్పొరేట్‌ స్థాయిలో పేద విద్యార్థులకు విద్యను, ఇతర వసతులు కల్పిస్తానని చెప్పడం జరిగింది. ఇక ఎందుకు ఉద్యమం చేయాలి’ తాను డోలేంద్రతో అనడంతో కక్ష కట్టినట్టుగా ఉన్నారని చెప్పారు. 

ప్రమాణం చేస్తారా?
డోలేంద్ర ప్రసాద్‌ ఫోన్‌ చేసి మాట్లాడాలని, ఎక్కడ ఉన్నావో చెబితే వస్తానని అడిగారని ఎమ్మెల్యే వెల్లడించారు. అయితే మీరెందుకు తానే వస్తానని ప్రసాద్‌కు చెప్పి 11వ తేదీ రాత్రి ఆయన ఇంటికి వెళ్లడం జరిగిందన్నారు. అయితే అప్పటికే అతను మద్యం మత్తులో ఉన్నాడని ఎమ్మెల్యే తెలిపారు. కస్తూరీదేవి విద్యాలయానికి వెళుతున్నావని తెలిసిందని, అక్కడ ఉద్యమం చేయాలని తనతో డోలేంద్ర అన్నారన్నారు. అయితే తాను ఎందుకు ఉద్యమం చేయాలని ప్రశ్నించడం జరిగిందన్నారు. ఈ మాటతో జీవీకే వారికి అమ్ముడుపోయావని తనను ప్రసాద్‌ అన్నారని, తాను కల్పించుకుని ఎక్కడ ఏ సమస్య ఉన్నా నిజాయితీగా పోరాటం చేస్తానని, గతంలో ఈ సమస్యపై 72 రోజులు పోరాటం చేసిన వ్యక్తిని అని చెప్పడంతోపాటు, ఎవరు ఎవరికి అమ్ముడుపోయారో జిల్లాలోని అందరికీ తెలుసని చెప్పానన్నారు. ఈ విషయంపై మాత్రమే మాట్లాడి వచ్చేశానన్నారు. అక్కడే తమ కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉన్న డాక్టర్‌ వసుంధర కూడా ఉన్నారన్నారు. ఈ విషయాన్ని వక్రీకరిస్తూ తాను మద్యం మత్తులో దాడి చేసినట్లుగా పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారన్నారు.

దీంతోపాటు ఎవరినో కిడ్నాప్‌ చేసినట్లుగా కూడా కేసు పెట్టడం జరిగిందన్నారు. కాగా ప్రత్యక్ష సాక్షి అయిన వసుంధర ఏమి చెప్పిందో స్టేషన్‌లో అందరూ తెలుసుకోవచ్చన్నారు. తాను మద్యం మత్తులో ఉన్నట్లు మీ బిడ్డలపై ప్రమాణం చేయడానికి సిద్ధమా అని డోలేంద్రకు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి సవాల్‌ విసిరారు. అయితే తాను దాడి చేసినట్లుగా కేసు పెట్టిన వ్యక్తి ఆ సమయంలో వైద్యశాలకు ఎందుకు వెళ్లలేదో చెప్పాలన్నారు. తాను ఎప్పుడూ హింసకు దూరమని, గాంధీగిరి పద్ధతిలోనే సమస్యలకు పరిష్కారం చూపే తనపై ఈ విధంగా ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. డోలేంద్ర చేస్తున్న అవినీతిని, దుర్మార్గాలను అడ్డుకుంటానన్నారు. పత్రిక ముసుగులో చేస్తున్న బ్లాక్‌మెయిల్‌ను, అవినీతి, అక్రమాలను అడ్డుకుంటానన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పి.రూప్‌కుమార్‌ యాదవ్, నాయకులు తాటి వెంకటేశ్వర్లు, బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, బొబ్బల శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

కేసు నమోదు
నెల్లూరు: నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే, అతని అనుచరులపై దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఈనెల 11వ తేదీ రాత్రి నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆయన అనుచరులు తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి దాడి చేశారని లెక్చరర్స్‌కాలనీలో నివాసం ఉంటున్న జమీన్‌రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్‌ దర్గామిట్ట పోలీసులకు లిఖిత ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేతోపాటు ఆయన పీఏ విష్ణు, మురళీకృష్ణ యాదవ్, సురేష్, మరో ఇద్దరిపై దర్గామిట్ట పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు