పండగపూట విషాదం 

17 Jan, 2019 08:05 IST|Sakshi
తండ్రికి తలకొరివి పెడుతున్న కూతురు

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

ఐదుగురికి గాయాలు

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పండగపూట విషాదం అలుముకుంది. వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు చనిపోయారు.  మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలం భీమారంకు చెందిన వరిగడ్డి అభిలాష్‌(15) కారుఢీకొని మృతిచెందాడు. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌ గ్రామానికి చెందిన అంగర్క శ్రీనివాస్‌(40) ట్రాక్టర్‌ పైనుంచిపడి దుర్మరణం చెందాడు. ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన సిరవేని హరీశ్‌(21) బైక్‌ అదుపుతప్పి ప్రాణాలు విడిచాడు. ఆయా ప్రమాదాల్లో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

మేడిపెల్లి(వేములవాడ): మేడిపెల్లి మండలంలోని భీమారంలో సంక్రాంతి పండుగ విషాదం నింపింది. మంగళవారం సాయంత్రం ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో వరిగడ్డి అభిలాష్‌(15) మృతిచెందాడు. కిరణ్‌ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామానికి చెందిన వరగడ్డి అశోక్, మమతకు కూతురు అర్చన, కొడుకు అభిలాష్‌ ఉన్నారు. పదేళ్లక్రితం అశోక్‌ అనారోగ్యంతో చనిపోయాడు. మమతనే తన పిల్లలను పోషిస్తోంది. అర్చన డిగ్రీ చదువుతోంది.

అభిలాష్‌ స్థానిక జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం అభిలాష్‌ తన మిత్రుడు కిరణ్‌తో కలిసి ద్విచక్రవాహనంపై మేడిపెల్లి వెళ్లాడు. తిరిగివస్తుండగా నాగులపేటకు చెందిన కుమ్మనపెల్లి నవీన్‌ కారుతో రంగాపూర్‌ శివారులో బైక్‌ను ఢీకొట్టాడు. బైక్‌పై ఉన్న ఇద్దరు కిందపడ్డారు. అభిలాష్‌ తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. కిరణ్‌ తీవ్రంగా గాయపడడంతో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎస్సై శ్రీనివాస్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మమత ఫిర్యాదుతో కారు డ్రైవర్‌ నవీన్‌పై కేసు నమోదు చేశారు. బుధవారం బాలుడి అంత్యక్రియలు జరిగాయి.  

ట్రాక్టర్‌ ప్రమాదంలో ఒకరు.. తలకొరివి పెట్టిన కూతురు 
వీణవంక(హుజూరాబాద్‌): ఆ కుటుంబాన్ని విధి వెక్కిరించింది. మూడేళ్ల క్రితం తల్లి, నేడు తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఇద్దరు చిన్నారులు ఆనాథలయ్యారు. మండలంలోని హిమ్మత్‌నగర్‌ గ్రామంలో అంగర్క శ్రీనివాస్‌(40) రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. స్థానికుల వివరాల ప్రకారం... శ్రీనివాస్‌– కవిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు అమూల్య, వర్షిత ఉన్నారు. మూడేళ్ల క్రితం కవిత ఆనారోగ్యంతో చనిపోయింది. శ్రీనివాస్‌ అన్నీ తానై పిల్లలను పోషిస్తున్నాడు. మంగళవారం నాడు బంధువులతో కలిసి ట్రాక్టర్‌లో భీమదేవరపల్లి మండలం కొత్తకొండ జాతరకు వెళ్లి మొక్కులు చెల్లించుకొని తిరుగుతిరిగి వస్తుండగా  ట్రాక్టర్‌ పైనుంచి కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. పెద్దకూతురు చితికి నిప్పంటించింది. తల్లిదండ్రులు దూరంకావడంతో చిన్నారులు అనాథలయ్యారు. 

బైక్‌ అదుపుతప్పి యువకుడు..
ఇల్లంతకుంట(మానకొండూర్‌): ద్విచక్రవాహనంపై నుంచి కింద పడి  యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం ఇల్లంతకుంట బిక్కవాగు కాజ్‌వేపై చోటు చేసుకుంది. మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన సిరవేని హరీశ్‌(21)మండలంలోని వెల్జిపూర్‌కు వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి తండ్రి కొమురయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై చంద్రశేఖర్‌ తెలిపారు.   

మరిన్ని వార్తలు