ఖమ్మంలో బాలుడి హత్య..!

25 Aug, 2019 10:12 IST|Sakshi
బాలుడి మృతదేహం లభ్యమైన పాత ఇల్లు

సాక్షి, ఖమ్మం: నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైన బాలుడి మృతదేహం కుళ్లిన స్థితిలో లభ్యమైంది. బాలుడి ఇంటి పక్కనే ఓ పాత ఇంట్లో దూలానికి ఉరి వేసకున్నట్లు వేలాడుతూ కనిపించింది. దుర్వాసన వస్తుండగా స్థానికులు గుర్తించారు. ఈ ఘటన ఖమ్మం నగరంలో సంచలనం సృష్టించింది. స్థానికుల కథనం ప్రకారం.. నగరంలోని త్రీటౌన్‌ ప్రాంతంలో మురా రాము, శ్రీలక్ష్మి దంపతులు జీవనం సాగిస్తున్నారు. రాము మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఇతని పెద్దకుమారుడు ప్రేమ్‌ సాగర్‌ (13) స్థానిక నయాబజార్‌ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు.

ఆ బాలుడు ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం పాఠశాలకు అని బయలుదేరి ఇంటికి తిరిగిరాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అన్ని ప్రాంతాలలో వెతికారు. దగ్గర బంధువు అయిన కొండయ్య అనే వ్యక్తి బాలుడిని తీసుకుని మున్నేరుకు చేపలు పట్టడానికి వెళ్లారని, అక్కడ మున్నేరులో ప్రేమ్‌ సాగర్‌ పడిపోయాడని మరో బాలుడు చెప్పాడు. దీంతో కుటుంబసభ్యులు కొండయ్యను పిలిచి ప్రశ్నించగా.. తనకు ఏమి తెలియదని బుకాయించాడు. దీంతో వారు ఖమ్మం త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కిడ్నాప్, అదృశ్యం క్రింద కేసు నమోదు చేశారు. కొండయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అప్పటి నుంచి శనివారం వరకు మున్నేరులో బాలుడి మృతదేహం కోసం పోలీసులు, బంధువులు గజ ఈతగాళ్లను పెట్టి గాలిస్తున్నారు.

నాలుగురోజుల తర్వాత పాత ఇంట్లో కుళ్లిపోయిన స్థితిలో..  
బొక్కల గడ్డలో వీరు ఉంటున్న నివాసం సమీపంలో పాత ఇంటి నుంచి శనివారం రాత్రి నుంచి దుర్వాసన వస్తోంది. దీంతో స్థానికులు ఆ ఇంట్లో ఏదో కుక్క చనిపోయి ఉంటుందని భావించారు. దుర్వాసన బాగా వస్తుండడంతో స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా.. దూలానికి బాలుడు ఉరివేసుకున్నట్లు మృతదేహం వేలాడుతూ కనిపించింది. అది కూడా కుళ్లిపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో స్థానికులు భయకంపితులయ్యారు. సమాచారం తెలిసిన బాలుడి తల్లిదండ్రులు కూడా వచ్చి చూడగా మృతదేహం శరీరంపై తమకుమారుడు ఇంటినుంచి వెళ్లేటప్పుడు వేసుకున్న దుస్తులు కనిపించాయి. అనుమానంతో వారు దగ్గరగా వెళ్లి పరిశీలించగా.. అది ప్రేమ్‌ సాగర్‌ మృతదేహంగా తేలింది. దీంతో బాలుడి తల్లిదండ్రులు, సోదరుడు గుండెలు పగిలేలా రోదించారు. తమ కుమారుడిని ఇంతటి దారుణ స్థితిలో చూస్తామనుకోలేదంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. బాలుడి తల్లి శ్రీలక్ష్మి సొమ్మసిల్లిపడిపోయింది.

హత్యేనని అనుమానాలు 
బాలుడి మృతదేహం లభ్యమైన తీరును బట్టి అది హత్యేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరో కావాలనే దారుణంగా హత్య చేసి దానిని ఆత్మహత్యగా చిత్రీకరించి ఉండవచ్చని తెలుస్తోంది. బాలుడు అదృశ్యమైన కొద్దిగంటల్లోనే హత్యకు గురి అయివుంటాడని, అనంతరం పాత ఇంట్లో దూలానికి ఉరివేసుకున్నట్లు వేలాడదీసి ఉంటారని స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు. ఆ ఇంట్లో కొంతకాలంగా బొమ్మాబొరుసు ఆట ఆడుతున్నారని, ఈ బాలుడి ఇటీవల కాలంలో ఆడుతుండటంతో అక్కడ గొడవపడి ఈదారుణానికి పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పోలీసులు అదుపులోకి తీసుకున్న బాలుడి సమీప బం«ధువు వింతగా ప్రవర్తిస్తుంటాడని, అతనే ఈ అఘాయత్యానికి పాల్పడి ఉండవచ్చని కూడా తెలుస్తోంది.

హత్యచేసినవారు తెలివిగా కుటుంబసభ్యులకు అనుమానం రాకుండా బాలుడి ఇంటి పక్కనే ఉన్న పాత ఇంట్లో మృతదేహాన్ని వేలాడదీసినట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల నుంచి మున్నేరులో కొట్టుకుని పోయాడని, తోసివేశారని, వాగులో దూకాడని ప్రచారం జరిగింది. కుటుంబ సభ్యులను తప్పుదారి పట్టించేందుకే నిందితులు పుకార్లు లేపిఉంటారనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. 6వ తరగతి చదివే బాలుడు ఆత్మహత్యకు పాల్పడటానికి ఎటువంటి అవకాశం ఉండదని, ఎవరో హత్య చేశారని బంధవులు ఆరోపిస్తున్నారు. బాలుడి అదృశ్యం వెనుక అనుమానం ఉన్న కొండయ్య అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తప్ప.. సరిగా విచారణ చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సంఘటన స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే  
బాలుడి మృతదేహం లభ్యమైన ప్రదేశాన్ని స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ సందర్శించి కుటుంబసభ్యులను ఓదార్చారు. బాలుడి మృతిపై దర్యాప్తు వేగవంతం చేయాలని పోలీసులకు సూచించారు. పీడీఎస్‌యూ నాయకులు ఆజాద్‌ , కాంగ్రెస్‌ మైనారిటీ సెల్‌ నాయకులు బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలని, బాలుడి మృతి వెనుకఉన్న మిస్టరీని చేధించాలని డిమాండ్‌ చేశారు. ఏసీపీ వెంకట్రావు, త్రీటౌన్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌ మృతదేహన్ని పరిశీలించారు. డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించగా.. బాలుడి మృతదేహం లభించిన పాత ఇంటినుంచి కొద్దిగా ముందుకు వెళ్లి అక్కడ ఉన్న సీసీ రోడ్డువద్దకు వచ్చి ఆగిపోయింది.  

మృతదేహాన్ని బయటకు తీసిన అన్నం ఫౌండేషన్‌ సభ్యులు
దారుణంగా కుళ్లిపోయి పురుగులు పట్టి ఉన్న బాలుడి మృతదేహం తీయటానికి పోలీసులు , స్థానికులు వెనుడగు వేశారు. దీంతో ప్రముఖ సామాజిక వేత్త అన్నం ఫౌండేషన్‌ అధినేత అన్నం శ్రీనివాస్‌రావుకు సమాచారం అందించగా.. ఆయన తన ఫౌండేషన్‌ సభ్యులైన ఈశ్వరమ్మ, సరస్వతి, రాజేష్, సురేష్‌లతో కలిసి వచ్చి.. మృతదేహన్ని కిందకు దించి మార్చురీకి తరలించారు. త్రీటౌన్‌ పోలీసులు అనుమానస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే మిస్టరీ చేధిస్తామని చెబుతున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా