నైట్‌ బర్త్‌డే... మార్నింగ్‌ డెత్‌ డే

4 Feb, 2019 08:04 IST|Sakshi

మిత్రులతో కలిసి రాత్రంతా బర్త్‌ డే వేడుకను ఆనందంగా జరుపుకున్న యువ కానిస్టేబుల్‌

ఉదయాన్నే ఆత్మహత్యకు పాల్పడడం ఏఆర్‌ విభాగం వర్గాల్ని కలవరంలో పడేసింది.

తుపాకీతో కాల్చుకుని బలవన్మరణం

పళ్లిపట్టులోని యువ కానిస్టేబుల్‌ కుటుంబం శోక సంద్రంలో మునిగింది

సాక్షి, చెన్నై:  గత ఏడాది సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్‌ నెలల్లో పోలీసుల బలన్మరణాలు కలకలం రేపిన విషయం తెలిసిందే. సెలవుల కరువు, పని భారం, మానసిక ఒత్తిడి, ఉన్నతాధికారుల వేధింపులు అంటూ ఆత్మహత్యలకు పాల్పడే వారు కొందరు అయితే, రాజీనామాలు సమర్పించి గుడ్‌ బై చెప్పిన వాళ్లు మరెందరో. ఈ పరిణామాలు పోలీసు యంత్రాంగాన్ని కలవరంలో పడేయడమే కాదు, విమర్శలు, ఆరోపణల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి. చివరకు పోలీసుల్లో నెలకొన్న మానసిక ఒత్తిడి తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. పోలీసులు తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి నేరుగా తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే, మానసిక ఒత్తిడి తగ్గించే విధంగా శిక్షణ, అవగాహన కార్యక్రమాల్ని విస్తృతం చేశారు. దీంతో గత రెండు నెలలుగా పోలీసు శాఖలో ఒత్తిళ్లు, పనిభారం, ఆత్మహత్యలు అన్న నినాదం వినిపించలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆదివారం వేకువజామున సాయుధ బలగాల విభాగం ఐజీ కార్యాలయం క్వార్టర్స్‌లో పేలిన తుపాకీ మళ్లీ పోలీసుల్లో కలవరాన్ని రేపింది. 

ఆనందం...విషాదం
తిరుత్తణి సమీపంలోని పళ్లిపట్టు వేటకారన్‌ గ్రామం అమ్మన్‌ కోవిల్‌ వీధికి చెందిన కన్నన్, రాధ దంపతుల కుమారుడు మణికంఠన్‌(26) బీఎస్సీ  పట్టభద్రుడు. పోలీసు కావాలన్న ఆశతో అందుకు తగ్గ ప్రయత్నాలు చేసి సఫలీకృతుడయ్యారు. 2017లో పోలీసు విభాగంలో చేరాడు. శిక్షణ అనంతరం గత ఏడాది జూలైలో ఆర్ముడ్‌ రిజర్వు(ఏఆర్‌) విభాగంలో కానిస్టేబుల్‌గా  విధులకు చేరాడు. ప్రస్తుతం కీల్పాకంలోని సాయుధ దళ విభాగం ఐజీ కార్యాలయంలో విధుల్ని నిర్వర్తిస్తున్నాడు. ఆదివారం 26వ ఏట అడుగు పెట్టిన మణికంఠన్‌ తన బర్త్‌ డేని డెత్‌ డేగా మార్చుకున్నాడు. ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి ఆ కార్యాలయం వెనుక ఉన్న క్వార్టర్స్‌లో బస ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి మిత్రులతో కలిసి బర్త్‌ డే జరుపుకున్నాడు. అర్ధరాత్రి వేళ కేక్‌ కట్‌ చేసి ఆనందాన్ని పంచుకున్నాడు. అందరూ వెళ్లిన అనంతర తన గదిలోకి వెళ్లాడు.

అయితే, సరిగ్గా  ఆదివారం ఉదయం ఐదు గంటల పది నిమిషాల సమయంలో ఆ గదిలో నుంచి తుపాకీ పేలిన శబ్దం విన్న సహచర సిబ్బంది పరుగులు తీశారు. మణికంఠన్‌ తన తుపాకీతో నెత్తికి గురిపెట్టి కాల్చుకుని రక్తపు మడుగులో పడి ఉండడంతో ఆగమేఘాలపై కీల్పాకం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మణికంఠన్‌ మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ సమాచారం అందుకున్న అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే, రాత్రంతా మిత్రులతో ఆనందంగా పుట్టిన రోజు జరుపుకున్న మణికంఠన్‌ ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో అన్న అనుమానాలు బయలు దేరాయి. సమాచారం అందుకున్న కీల్పాకం పోలీసులు కేసు నమోదు చేసి విచారణను వేగవంతం చేశారు. సెలవులు లేక పని భారం పెరిగడం, మానసిక ఒత్తిడి లేదా, కుటుంబ తగాదాలు, మరేదేని విభేదాలు ఆత్మహత్యకు కారణంగా ఉన్నాయా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. 

ప్రేమ వ్యవహారం కారణమా? 
మణికంఠన్‌ ఆత్మహత్య వెనుక ప్రేమ వ్యవహారం ఏదేని కారణంగా ఉండవచ్చని పోలీసులు అనుమానాల్ని  వ్యక్తంచేస్తున్నారు. బర్త్‌ డే వేడుకల అనంతరం సెల్‌ఫోన్‌లో చాలాసేపు ఎవరితోనో మాట్లాడినట్టుగా విచారణలో తేలింది. దీంతో అతడి సెల్‌ఫోన్‌ను చేజిక్కించుకుని అందులోని నంబర్ల ఆధారంగా విచారణ జరుపుతున్నారు.  

మరిన్ని వార్తలు