అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య

9 Mar, 2020 13:29 IST|Sakshi
మృతదేహం వద్ద విలపిస్తున్న భార్య, పిల్లలు,రాఘవరెడ్డి (ఫైల్‌)

ఉరికొయ్యగా మారిన పొగాకు పందిరి

పంటల సాగుకోసం రూ.6 లక్షల అప్పు చేసిన వైనం

కొమరోలు (గిద్దలూరు): అప్పుల బాధ తాళలేక యువ రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని ముక్తాపురం పంచాయతీ పరిధిలో గల వెన్నంపల్లె గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. ఈ సంఘటనలో గ్రామానికి చెందిన రావిపాటి రాఘవరెడ్డి (40) పొగాకు పందిరికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అందిన సమాచారం ప్రకారం.. రాఘవరెడ్డి తన తల్లి రామలక్ష్మమ్మ పేరుతో ఉన్న 2.50 ఎకరాల పొలాన్ని తీసుకుని పంటలు సాగుచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గత ఏడాది వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటలు పండక, పంటల సాగుకు, కుటుంబ జీవనానికి అప్పులు తప్పలేదు. గత ఐదేళ్లపాటు పంటలు పండకపోవడంతో గతంలో చేసిన అప్పులు తీరకపోగా, తిరిగి పంటల సాగుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దీంతో గ్రామంలోని పలువురి వద్ద రూ.5 లక్షల వరకు అప్పు చేశాడు. గ్రామంలోని రామాలయం అభివృద్ధి కోసం వసూలు చేసే రుసుం సొమ్ములో నుంచి మరో రూ.1 లక్ష అప్పుగా తీసుకున్నాడు. అప్పులు పెరిగిపోతున్నా, పొలంలో ఆదాయం అనుకున్నంత రాకపోవడంతో తాను చేసిన అప్పులు తీర్చలేనేమోనన్న ఆందోళనకు గురైన రాఘవరెడ్డి రాత్రి పొలానికి వెళ్లి వస్తానని చెప్పి భార్యతో చెప్పి వెళ్లాడు. అక్కడ పొగాకు పందిరికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం పొద్దు ఎక్కేంత వరకు ఇంటికి రాలేదని పొలానికి వెళ్లి చూడగా అక్కడ పొగాకు పందిరికి శవమై వేల్లాడుతున్నాడని బంధువులు తెలిపారు. మృతునికి భార్య రమాదేవి, 11 సంవత్సరాల కుమారుడు వంశీకృష్ణారెడ్డి, 9 సంవత్సరాల కుమార్తె శివశ్రీరెడ్డి ఉన్నారు. మృతుని భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

మరిన్ని వార్తలు