బావమర్దినే పెళ్లి చేసుకోవాలని మందలించడంతో..

15 Feb, 2020 10:07 IST|Sakshi
రోదిస్తున్న భూమిక తల్లి రాధ, మృతురాలు భూమిక(ఫైల్‌)

మద్యం మత్తులో ఘర్షణ పడి కొట్టిన అన్న

మనస్తాపంతో పురుగులమందు తాగి ఆత్మహత్య

సాక్షి, పాల్వంచ: తన బావమర్దితో పెళ్లికి ఒప్పుకోకుండా, వేరే వ్యక్తితో వివాహానికి ఎలా అంగీకరించావంటూ అన్న కొట్టడంతో తీవ్ర మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని జ్యోతినగర్‌కు చెందిన సప్పిడి భూమికకు జనవరి 9న మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌కు చెందిన యువకుడితో నిశ్చితార్థం జరిగింది. బాలికకు 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉండడంతో మైనార్టీ తీరిన తర్వాత వివాహం జరపాలని పెద్దలు నిర్ణయించారు. ఈ నెల 12న తల్లిదండ్రులు ఆరోగ్య పరీక్షల నిమిత్తం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లగా, భూమికను పాతపాల్వంచలోని అన్న రాంబాబు ఇంటి వద్ద వదిలి వెళ్లారు. 

ఈ క్రమంలో గురువారం సాయంత్రం బాలిక పక్కనే ఉన్న జ్యోతినగర్‌లోని ఇంటికి వచ్చింది. కొద్ది సేపటికే అక్కడికి వచ్చిన రాంబాబు మద్యం మత్తులో భూమికతో ఘర్షణ పడి, చేయి చేసుకున్నాడు. అనంతరం అతిగా మద్యం సేవించి ఉండడంతో అక్కడే పడిపోయాడు. తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక పురుగుల మందు తాగింది. స్థానికులు గుర్తించి పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యసేవల నిమిత్తం కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. పాల్వంచ సీఐ నవీన్, ఎస్‌ఐ జే.ప్రవీణ్‌ మృతదేహాన్ని సందర్శించారు. తల్లి రాధ ఫిర్యాదు మేరకు రాంబాబుపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

రాంబాబు స్నేహితుడిపై అనుమానం..
కాగా రాంబాబుతో పాటు అతని స్నేహితుడు కూడా మద్యం సేవించి, భూమిక వద్దకు వచ్చాడని, గొడవ అనంతరం అతిగా మద్యం సేవించి ఉండడంతో రాంబాబు పడిపోయిన తర్వాత అతని చెల్లిపై అఘాయిత్యానికి యత్నించాడని, అందువల్లే బాలిక బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. పోలీసుల విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియనున్నాయి.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు