ప్రేమించి..ప్రాణం తీసుకున్నారు!

16 Feb, 2018 13:45 IST|Sakshi
రమ్య (ఫైల్‌), సాయిరాం (ఫైల్‌)

పెద్దలను ఒప్పించలేక తనువు చాలించిన యువకుడు, వివాహిత

ప్రేమికుల దినోత్సవం రోజే రైలు కింద పడి ఆత్మహత్య

ఇద్దరూ చీరాల ప్రాంత వాసులే

వివాహితకు ఇద్దరు పిల్లలు

చీరాల: వారు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. యువతికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా కలి సి ఉండాలన్న ఆ ప్రేమికుల కోరికను పెద్దలు అంగీకరించలేదు. వివాహ బంధం వారి కలయికకు అడ్డుగా మారింది. పెద్దలను ఒప్పించే ధైర్యం లేక సమాజం చిన్నచూపు చూస్తోం దని భావించి ప్రేమికుల దినోత్సవం రోజే యువకుడు, వివాహిత రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి సమయంలో వేటపాలెం మండలం రామన్నపేట రైల్వేగేటు సమీపంలో జరగగా గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మృతి చెందిన వారిలో వివా హితది చీరాల మండలం దేవాంగపురి గ్రామం కాగా యువకుడిది చీరాల మండలం  గాంధీనగర్‌ పంచాయతీలోని ఎంజీసీ కాలనీ. మృతులు ఒకే సామాజిక వర్గం వారు.

ఏం జరిగిందంటే..
మండలంలోని గాంధీనగర్‌ పంచా యతీ ఎంజీసీ కాలనీకి చెందిన యువకుడు చితిరాయిలా సాయిరాం (24), జాండ్రపేట పోస్టాఫీసు ప్రాంతానికి చెందిన వివాహిత పొట్టి రమ్య (24)లు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రమ్యకు భర్త రవికుమార్, 5 ఐదేళ్ల కుమారుడు, 3 ఏళ్ల కుమార్తె ఉన్నారు. వివాహిత, అవివాహితుడు ఇద్దరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. తమ నిర్ణయాన్ని పెద్దలకు చెబితే ఒప్పుకోరని భావించడం.. కలిసి ఉండలేమని బాధ.. వెరసి అర్ధాంతరంగా తనువు చాలించాలని నిర్ణయించుకుని రైలు కిందపడి కలిసి ఆత్మహత్య చేసుకున్నారు.

కొంపముంచిన క్షణికావేశం
కుటుంబానికి అండగా ఉంటాడని భావించిన తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేసిన యువకుడు.. తాను జీవితాంతం కలిసి ఉంటానని ప్రమాణం చేసి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన రమ్య క్షణికావేశానికిలోనై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.

అనుమానాస్పద మృతి కేసునమోదు
సంఘటన స్థలాన్ని చీరాల జీఆర్పీ ఎస్‌ఐ జి.రామిరెడ్డి పరిశీలించి వివరాలు సేకరించారు. అనుమానాస్పద రైల్వే ప్రమాద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రమ్య, సాయిరాం మృతదేహాలను చీరాల ఏరియా వైద్యశాల మార్చురీకి తరలించారు. శవ పరీక్ష నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందించారు.

మరిన్ని వార్తలు