రైలు పట్టాలపై బైక్‌ ఆపిన యువకుడు

20 May, 2019 07:06 IST|Sakshi

తిరువొత్తియూరు: రైలు పట్టాలపై బైకును అడ్డంగా నిలిపి మదురై – రామేశ్వరం ప్యాసెంజర్‌ రైలును మార్గమధ్యలో ఆపిన యువకుడిని మానామదురై పోలీసులు, రైల్వే భద్రతాదళం సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మదురై నుంచి ఆదివారం ఉదయం రామేశ్వరం వెళ్లే ప్యాసెంజర్‌ రైలు ఉదయం 6.50 గంటలకు బయలుదేరింది. త్రిభువనవనం రైల్వేస్టేషన్‌కు వచ్చి తరువాత తిరిగి ఏడు గంటలకు మానామదురైకి బయలుదేరింది. లాడానేందల్‌ నాలుగు రోడ్డు కూడలి వంతెన కింద వెళుతుండగా పట్టాలపై బైకును నిలిపి దానిపై ఓ యువకుడు కూర్చొని ఉన్నాడు. ఇది చూసిన డ్రైవర్‌ రైలును ఆపివేశాడు. ప్రయాణికులు బైక్‌ను పక్కన పెట్టి యువకుడిపై పోలీసులు సమాచారం ఇచ్చారు.

దీంతో అర్ధగంట ఆలస్యంగా రైలు కదిలింది. పోలీసులు అక్కడికి వచ్చి చూడగా అప్పటికే ఆ యువకుడు పారిపోయాడు. దీనిపై మానామదురై రైల్వే ఎస్‌ఐ నాచ్చి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో రైలును నిలిపిన యువకుడు మానామదురై యానాది సెంగోటైకి చెందిన కార్‌మేఘం కుమారుడు షన్ముగవేల్‌ అని తెలిసింది. మద్యం మత్తులో రైలును ఆపినట్టు తెలిసింది. దీనిపై షణ్ముగవేల్‌ తండ్రి కార్‌మేఘం మాట్లాడుతూ.. కొన్ని వారాలకు ముందు అతని స్నేహితుడు బైకులో వెళ్లి ప్రమాదానికి గురై మృతి చెందాడని..దీంతో షణ్ముగవేల్‌ మానసిక రుగ్మతకు గురై ఇలా ప్రవర్తిస్తున్నట్టు తెలిపారు.

>
మరిన్ని వార్తలు