యువకుడి దారుణహత్య

31 Jul, 2019 12:46 IST|Sakshi
దాసరి శివ మృతదేహాన్ని పరిశీలిస్తున్న నగర డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్‌ (ఇన్‌సెట్‌లో) దాసరి శివ(ఫైల్‌)  

రాయితో మోది, ఆపై గొంతుకోసిన దుండగులు

ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్‌

విభిన్న కోణాల్లో కేసు దర్యాప్తు

సాక్షి, నెల్లూరు(క్రైమ్‌): కుటుంబ కలహాలో? స్నేహితుల మధ్య గొడవలో? మరే ఇతర కారణాలో తెలియదు కానీ ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు రాయితో తలను పగులగొట్టి బీరుసీసా లేదా పదునైనా ఆయుధంతో గొంతుకోసి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన నెల్లూరు నగరంలోని నీలగిరిసంఘం దోబీఘాట్‌(నెక్లెస్‌ రోడ్డు వద్ద) సమీపంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. నీలగిరిసంఘానికి చెందిన దాసరి వెంకటమ్మకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. ఆమె ఈఎస్‌ఐ ఆస్పత్రిలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. నాలుగో కుమారుడు శివ కొన్నేళ్ల క్రితం పెన్నా పొర్లుకట్ట ప్రాంతానికి చెందిన పోలమ్మను వివాహం చేసుకుని దొడ్ల డెయిరీ సమీపంలో నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. రెండేళ్ల క్రితం పోలమ్మ అనారోగ్యంతో మృతిచెందడంతో పిల్లలతో కలిసి తల్లి వద్దకు వచ్చాడు.

అప్పటి నుంచి తల్లి వద్ద ఉంటూ ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నాడు. కుమార్తె నగరంలోని ఓ షాపింగ్‌ మాల్‌లో ప్యాకింగ్‌ సెక్షన్‌లో పనిచేస్తోంది. మద్యానికి బానిసైన శివ సంపాదించిన నగదును మద్యానికి వెచ్చించసాగాడు. సోమవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో శివ ఇంట్లో భోజనం చేసి బయటకు వెళ్లివస్తానని తల్లికి చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలో అతని జేబులో డబ్బులు ఉండటాన్ని గమనించిన తల్లి డబ్బులు ఇవ్వమని అడగగా ఇవ్వకుండా వెళ్లిపోయాడు. రాత్రి 10.30 గంటలు దాటినా కుమారుడు ఇంటికి రాకపోవడంతో వెంకటమ్మ అతనికి ఫోన్‌ చేసింది. ఇంటికి త్వరగా వచ్చేయాలని కోరగా వచ్చేస్తానని చెప్పి శివ ఫోన్‌ కట్‌ చేశాడు. నెక్లెస్‌ రోడ్డు వద్ద శివ ఉండటాన్ని గమనించిన అతని అన్న కుమార్‌ సైతం త్వరగా ఇంటికి వెళ్లాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ శివ అతి కిరాతకంగా హత్యకు గురయ్యాడు. మంగళవారం ఉదయం శివ మృతదేహాన్ని గమనించిన స్థానికులు చిన్నబజారు పోలీసులకు సమాచారం అందించారు. శివ మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అతని పిల్లలు గుండెలవిసేలా రోదించారు. మృతదేహాన్ని చూసేందుకు స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు.

నగర డీఎస్పీ జె.శ్రీనివాసులురెడ్డి, చిన్నబజారు పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఐ.శ్రీనివాసన్, ఎస్‌ఐ పి.చిన్నబలరామయ్య ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహానికి సమీపంలో సిమెంటు రాయి, బీరు బాటిల్, ఒక జత చెప్పులు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. శివ జేబులో ఉన్న సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలంలో క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ తనిఖీలు నిర్వహించింది. అయినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. అనంతరం పోలీసు అధికారులు బాధిత తల్లి వెంకటమ్మ, సోదరుడు కుమార్‌లతో మాట్లాడి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు. ప్రభుత్వ వైద్యులు మృతదేహానికి శవపరీక్ష నిర్వహించి బాధిత కుటుంబసభ్యులకు అప్పగించారు. 

విభిన్న కోణాల్లో కేసు దర్యాప్తు 
ఇదిలా ఉండగా భార్య మరణాంతరం శివ నీలగిరిసంఘానికి చెందిన మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడని పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. దాసరి శివను అతి కిరాతకంగా హత్య చేయడం వెనుక ఉన్న కారణాల అన్వేషణలో పోలీసులు నిమగ్నమయ్యారు. హత్య జరిగిన తీరును బట్టి ఓ పథకం ప్రకారమే హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. దర్యాప్తు ముమ్మరం చేశారు. శివ సెల్‌ఫోన్‌ కాల్‌ డీటైల్స్‌ను పరిశీలిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టామని, త్వరలోనే నిందితులను అరెస్ట్‌ చేస్తామని ఇన్‌స్పెక్టర్‌ ఐ.శ్రీనివాసన్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు