యువకుడి ఆత్మహత్య.. కలకలం

19 Jun, 2018 15:24 IST|Sakshi

సాక్షి, మేడ్చల్ : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కీసర మండలం దమ్మాయిగూడలో ఫైనాన్సియర్‌ ఒత్తిడితో మంగళవారం ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలివి.. మహమ్మద్‌  హనీఫ్‌ దమ్మాయిగూడలో పిల్లలకు ట్యూషన్‌ చెబుతూ జీవనం సాగిస్తున్నాడు. అతను నాగారం నుంచి దమ్మాయిగూడకు వచ్చి వెళ్లేవాడు. ఆ సమయంలో షాహిదా అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే వారిద్దరూ సహజీవనం సాగిస్తున్నారు.

మమహ్మద్‌ హనీఫ్‌కు కొంత డబ్బు అవసరమైంది. షాహిదాను కలిసి తెలిసిన వారి వద్ద రూ. 1,40,000 అప్పుగా ఇప్పింమని అడిగాడు. కాప్రా మండలం, సాయినగర్‌కు చెందిన శ్రీకాంత్‌ గౌడ్‌ అనే ఫైనాన్స్‌ వ్యాపారి వద్ద షాహిదా అప్పు ఇప్పించింది. కానీ మహమ్మద్‌ తీసుకున్న అప్పు కట్టలేదు. దీంతో శ్రీకాంత్‌ గౌడ్‌ షాహిదాను నువ్వు కట్టాల్సిందే అని హెచ్చరించాడు. అనంతరం మహమ్మద్‌, షాహిదాల మధ్య మంగళవారం మధ్యాహ్నం గొడవ జరిగింది.

అతను ఆవేశంగా ట్యూషన్‌ చెప్పే ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుని గొళ్ళెం పెట్టుకున్నాడు. కోపం వచ్చినప్పుడు తరచూ ఇలానే చేసేవాడని షాహిదా పట్టించుకోలేదు. అతను ఎంతసేపటికి బయటకు రాలేదు. అనుమానం వచ్చి షాహిదా కిటికిలో నుంచి చూసింది. అతను ఫ్యాన్‌కు ఉరి వేసుకుని నిర్జీవంగా కనిపించాడు. వెంటనే ఆమె 100 నంబర్‌కి ఫోన్‌ చేసి జవహర్‌ నగర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటన స్థలం చేరుకుని పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

అతని మరణ వార్త విని కుటుంబ సభ్యలు షాక్‌కు గురయ్యారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ కొడుకు చావుకు శ్రీకాంత్‌ గౌడ్‌, షాహిదాలే కారణమని కుటుంబ సభ్యులు విలపించిన తీరు అందర్నీ కంటతడి పెట్టించింది.

మరిన్ని వార్తలు