ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య

1 Feb, 2020 08:42 IST|Sakshi
సైదులు (ఫైల్‌)

ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో

రాంగోపాల్‌పేట్‌: పనిచేసే సంస్థ సొమ్మును సొంత అవసరాల కోసం వాడుకోవడంతో వాటిని చెల్లించాలని నిర్వాహకులు ఒత్తిడి చేయడంతో మనస్తాపానికిలోనైన ఓ యువకుడు లాడ్జిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.హయత్‌నగర్‌ భాగ్యలత కాలనీకి చెందిన వరికుప్పల సైదులు అలియాస్‌ సాయి (28)ముషీరాబాద్‌లోని టే ట్‌ సెట్టర్స్‌ బిజినెస్‌ సొల్యూషన్స్‌ సంస్థలో బైక్‌ రికవరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం సంస్థకు చెందిన రూ.25వేలు సొంత అవసరాల కోసం వాడుకున్నాడు. అదే సంస్థలో మేనేజర్‌గా  ప్రసాద్‌ అనే వ్యక్తి వద్ద రూ.12వేలు అప్పు చేశాడు.

గత కొద్ది రోజులుగా ఆఫీస్‌ డబ్బుతో పాటు, తన వద్ద అప్పుగా తీసుకున్న  మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ప్రసాద్‌ సైదులుపై ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో  మనస్తాపానికిలోనైన సైదులు ఈ నెల 29న ఉదయం ఆఫీస్‌కు వెళుతున్నట్లు చెప్పి ఇంట్లో నుంచి బయటికి వచ్చాడు. సాయంత్రం ఇంటికి రాకపోగా, అతడి సెల్‌ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌లో ఉండటంతో ఆందోళన చెందిన అతడి భార్య మాధవి హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ నెల 30న ఉదయం సైదులు కేకే రెసిడెన్సీలో రూమ్‌ నంబర్‌ 207లో బస చేశాడు. అదే రోజు మధ్యాహ్నం బయటికి వెళ్లి సాయంత్రం లాడ్జికి తిరిగి వచ్చాడు. శుక్రవారం సాయంత్రం వరకు అతను గదిలో నుంచి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన లాడ్జి నిర్వాహకులు గోపాలపురం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు  గది తలుపులు పగులగొట్టి చూడగా సైదులు ఫ్యానుకు  ఉరి వేసుకుని కనిపించాడు. 

వేధింపులే కారణం...
ఆఫీసు డబ్బులు వాడుకున్నాడని గత  కొద్ది రోజులుగా మేనేజర్‌ ప్రసాద్‌ సైదులుపై ఒత్తిడి చేస్తున్నాడని, అతడి వేధింపులు భరించలేకే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని  మృతుడి భార్య మాధవి, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

సెల్ఫీ వీడియో...
ఆత్మహత్య చేసుకునే ముందు సైదులు సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ‘తనకు బతకాలని లేదని, ఎంతో మంది పెద్ద, పెద్ద వాళ్లు చనిపోతున్నారని నేను కూడాముందే చనిపోవాలని అనుకుంటున్నాను, భార్య పిల్లలు జాగ్రత్త’ అంటూ వీడియోలో పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు