ఆప్యాయంగా మాట్లాడావు...అంతలోనే దూరమయ్యావు

8 Sep, 2018 13:58 IST|Sakshi
రోదిస్తున్న మృతుని తల్లి రాజేశ్వరి, (ఇన్‌సెట్‌లో) మృతుడు ఉదయ్‌

తల్లడిల్లిపోతున్న తల్లిదండ్రులు రాజేశ్వరి, వెంకటేశ్వర్లు

సత్తెనపల్లి రైల్వేస్టేషన్‌ వద్ద మృతి చెందిన వినుకొండ యువకుడు

కొత్త సంవత్సరం రోజున నీరసించి పడుకుంటే.. ఇంటి ముందు ముగ్గులు పెట్టావు కదయ్యా.. వంట్లో కొంచెం నలతగా ఉందిరా అంటే చాలు.. ఏమైందమ్మా అంటూ పదే పదే అడిగేవాడివి కదనాన్నా.. చదువుల కోసం దూరంగా ఉంటున్నా.. రోజులో పది సార్లు ఫోన్‌ చేసి మాట్లాడేవాడివే..‘అమ్మా..! ఏం చేస్తున్నావ్‌.. అన్నం తిన్నావా.. ఆరోగ్యం జాగ్రత్త.. అని పక్కనే ఉన్నట్లు పలకరించావురా.. మమ్మల్ని వదిలి ఎలా వెళ్లాలకున్నావ్‌ బిడ్డా.. నువ్వు లేకుండా మేమెలా బతకాలి’. అంటూ ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. వినుకొండకు చెందిన కొల్లి ఉదయ్‌ పవన్‌ వెంకట కుమార్‌(20) శుక్రవారం సత్తెనపల్లి వద్ద రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. చెట్టంత కొడుకు కట్టెగా మారి కన్నీరు మిగిల్చాడు.

వినుకొండటౌన్‌: ఏమైందో...ఏమో... అమ్మా ఏమి చేస్తున్నావూ... అన్నాడు...భోజనం చేశావా అని అడిగాడు... అవే చివరి మాటలుగా మిగిల్చాడు... అంటూ ఓ తల్లి తన కుమారుడు ఆత్మహత్యకు ముందు మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ రోదిస్తుంటే ఆమెను ఓదార్చడం ఎవరితరం కాలేదు. వివరాల్లోకి వెళితే... సత్తెనపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద ఆత్మహత్యకు పాల్పడిన కొల్లి ఉదయ్‌ పవన్‌ వెంకట కల్యాణ్‌(20) తల్లి రాజేశ్వరి రోధన వర్ణతీతంగా ఉంది. స్థానిక విష్ణుకుండిన నగర్‌లో నివాసం ఉంటున్న కొల్లి వెంకటేశ్వర్లు, రాజేశ్వరిలకు ఇరువురు సంతానం. కుమార్తె సంధ్య, తర్వాత అబ్బాయి ఉదయ్‌ పవన్‌ వెంకట కళ్యాణ్‌. స్వగ్రామం మండలంలోని జాలలపాలెం గ్రామం కాగా పిల్లల చదువుల నిమిత్తం వినుకొండ వచ్చి బస్టాండ్‌ సెంటర్‌లోని కృష్ణప్రియ లాడ్జి వద్ద, నరసరావుపేట రోడ్డులోని పెనుగొండ పెట్రోల్‌ బంకు ఎదురు టిఫెన్‌ సెంటర్లను నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండేళ్ల క్రితం విష్ణుకుండిన నగర్‌లో స్వంతంగా ఇంటిని నిర్మించుకున్నారు.

మూడు నెలల క్రితం కుమార్తెకు వివాహం చేశారు. కుమార్తె హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. కుమారుడు ఉదయ్‌ వైజాగ్‌లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు మూడవ సంవత్సరం చదువుతున్నాడు. ఏ చీకూ చింతా లేకుండా సాగిపోతోంది. గత శుక్రవారం ఇంటికి వచ్చిన ఉదయ్‌ మరుసటి రోజు శనివారం హైదరాబాద్‌లో ఉంటున్న అక్క సంధ్య వద్దకు వెళ్ళాడు. గురువారం రాత్రి అక్క వద్ద నుంచి బయలు దేరుతూ ఇంటివద్ద ఉన్న అమ్మనాన్నలకు ఫోన్‌ చేసి కాలేజీకి వెళ్తున్నట్టు చెప్పాడు. ఆ తర్వాత రాత్రి 10 గంటల సమయంలో మళ్లీ ఫోన్‌చేసి తల్లి రాజేశ్వరితో మాట్లాడాడు. ఏం చేస్తున్నావు... భోజనం చేశావా...నాన్న ఎక్కడ ఉన్నాడు అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. తెల్లవారే సరికి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం రావడంతో ఆ కుటుంబం దిగ్భ్రాంతి చెందింది. ఎదిగిన కుమారుడు కష్టాలు పంచుకుంటాడనుకుంటే కానరాని లోకాలకు వెళ్లిపోయాడని తల్లి రాజేశ్వరి రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. హైదరాబాద్‌లో బయలుదేరిన యువకుడు సత్తెనపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద మృతి చెందడం ఏమిటని పలువురు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. వైజాగ్‌ వెళ్లాల్సిన ఉదయ్‌ ఎందుకు మధ్యలో దిగిపోయాడు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమున్నదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏదిఏమైనా ఉదయ్‌ మృతికి కారణలు పోలీసుల విచారణలో తేలాల్సిఉందని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు