నింద మోపారని యువకుడి ఆత్మహత్య   

23 Jun, 2018 14:15 IST|Sakshi
ఆత్మహత్యకు పాల్పడ్డ శ్రీను  

 ఆస్పత్రి సామగ్రి  అపహరించావంటూ వేధింపులే కారణం

తన చావుకు బాధ్యులు మేడమ్, కరుణాకర్‌ అని సూసైడ్‌నోట్‌

జగ్యాతండాలో విషాదం

కురవి(డోర్నకల్‌) : తనపై దొంగతనం నెపం మోపి, తరచూ వేధింపులకు గురి చేస్తుండడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం మొగిలిచర్ల శివారు జగ్యాతండాలో శుక్రవారం సాయంత్రం జరిగింది. బాధిత కుటుంబ సభ్యుల కథనంప్రకారం... జగ్యా తండాకు చెందిన బానోతు శ్రీను(21) తన భార్య సంధ్య, కూతురితో కలిసి బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ వెళ్లాడు.

ఇదే తండాకు చెందిన నూనావత్‌ కరుణాకర్‌ మానుకోటలోని వసుమతిరెడ్డి ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గత మూడు నెలల క్రితం హైదరాబాద్‌లో ఉంటున్న శ్రీనుతో ఫోన్‌లో మాట్లాడి, దూరంగా బతకడం ఎందుకని, ఇక్కడికి వస్తే పని ఇప్పిస్తానని భరోసా ఇచ్చాడు. దీంతో శ్రీను తన కుటుంబ సభ్యులతో కలిసి తిరిగి తండాకు వచ్చాడు. కరుణాకర్‌ తాను పనిచేసే ఆస్పత్రిలోనే శ్రీనును వాచ్‌మెన్‌గా పనికి కుదిరించాడు.

ఈ క్రమంలో ఆస్పత్రిలో ఉండే సామగ్రి ఒక్కొక్కటి కనిపించడం లేదని, నువ్వే ఆ సామగ్రిని ఎత్తుకెళ్లావంటూ శ్రీనుపై  కరుణాకర్‌తోపాటు, ఆస్పత్రిలోని మేడమ్‌ నిందలు మోపారు. కాగా ఆస్పత్రిలోని కొలకుండ అనే వస్తువు కూడా మాయమైందని, దీన్ని కూడా నీవే తీశావని, నీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని శుక్రవారం శ్రీనును కరుణాకర్‌తోపాటు, ఆస్పత్రిలోని మేడమ్‌ బెదిరించారు.

తాను దొంగతనం చేయలేదని పలుమార్లు బతిమిలాడినా వారు వినిపించుకోలేదు. దీంతో తీవ్రమనోవేదనకు గురైన శ్రీను శుక్రవారం సాయంత్రం ఇంటికి చేరుకుని ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్‌నోట్‌లో ‘నా పేరు శ్రీను, నా చావుకు డీఆర్‌ కరుణాకర్, అందులో పనిచేసే మేడమ్‌ కారణం’ అని రాశాడు. ఆ తర్వాత ఇంటి పై కప్పుకున్న  కొక్కానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇంతలో బయటికి వెళ్లిన భార్య సంధ్య తలుపులు నెట్టి చూసేసరికి భర్త మృతదేహం వేలాడుతూ కనిపించడంతో ఒక్కసారిగా కేకలు పెడుతూ బయటికి పరుగులు తీసింది. చుట్టుపక్కల వారు సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్సై నాగభూషణం వచ్చి శవపంచనామా నిర్వహించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

మరిన్ని వార్తలు