బాలుడి గొంతు కోసిన యువకుడు

11 Oct, 2019 08:39 IST|Sakshi
చికిత్స పొందుతున్న చిన్నారి

చెన్నై,తిరువొత్తియూరు: ఇంటి తాళంచెవి ఇవ్వలేదని పక్కింటి వారితో గొడవ పడి, కత్తితో చిన్నారి గొంతు కోసి పారిపోయిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు చెన్నైలోని తిరువళ్లూరు వీధికి చెందిన వివేక్‌ కుమార్‌ పెయింటర్‌. అతని భార్య ప్రియ. వీరికి ఒకటిన్నరేళ్ల సాయి చరణ్‌ అనే కుమారుడు ఉన్నాడు. వీరి పక్కింటిలో నివాసం ఉంటున్న దంపతుల కుమారుడు ఆకాష్‌ (19). అతనికి గంజాయి, మద్యం అలవాటు ఉంది. ఈ క్రమంలో ఆకాష్‌ తల్లిదండ్రులు బుధవారం ఇంటికి తాళం వేసి ప్రియకు ఇచ్చి వెళ్లారు. సాయంత్రం ఇంటి వద్దకు వచ్చిన ఆకాష్‌ తన ఇంటి తాళం ఇవ్వమని ప్రియను అడిగాడు. అయితే కుమారుడికి తాళం ఇవ్వొద్దని అతని తల్లిదండ్రులు చెప్పారు. దీంతో ప్రియ తన వద్ద తాళం లేదని ఆకాశ్‌కు చెప్పింది.

దీంతో ఆగ్రహించిన అతను ప్రియతో గొడవ పడ్డాడు. అక్కడే ఆడుకుంటున్న సాయిచరణ్‌పై కూరగాయల కత్తితో దాడి చేశాడు. దానిని అడ్డుకోవాలని చూసిన ప్రియ తల్లి శారదపై దాడి చేసి పారిపోయాడు. తీవ్ర గాయాలతో తల్లడిల్లుతున్న సాయిచరణ్, శారదలను స్థానికులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం చిన్నారి సాయిచరణ్‌ను చెన్నై ఎగ్మూర్‌ చిల్డ్రన్స్‌ ఆసుపత్రిలో చేర్చారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పుళల్‌ పోలీసులు కేసు నమోదు చేసి ఆకాష్‌ను గురువారం ఉదయం అరెస్టు చేశారు. మాధవరం కోర్టులో హాజరుపరిచి విచారణ అనంతరం జైలుకు తరలించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు