కౌన్‌బనేగా కరోడ్‌పతి అంటూ..

29 Jun, 2019 12:44 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : ‘మేము కౌన్‌బనేగా కరోడ్‌పతి నుంచి ఫోన్‌ చేస్తున్నాం. మీరు ప్రైజ్‌మనీ గెలుచుకున్నారు. కొంత నగదు చెల్లిస్తే మనీ మీకు ఇస్తామం’ ఓ యువకుడ్ని ఇద్దరు వ్యక్తులు బురీడీ కొట్టించి రూ.2.11 లక్షల నగదు కాజేశారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరులోని నవాబుపేట గాండ్లవీధికి చెందిన ఓ యువకుడు బీటెక్‌ పూర్తి చేశాడు. ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. ఈనెల 21వ తేదీన రాణాప్రతాప్‌ సింగ్, సింఘానియా అనే ఇద్దరు వ్యక్తులు వేర్వేరు ఫోన్‌ నంబర్ల నుంచి సదరు యువకునికి ఫోన్‌ చేశారు. తాము కౌన్‌బనేగా కరోడ్‌పతి నుంచి మాట్లాడుతున్నామని అతడిని నమ్మించారు.

ఫోన్‌ నంబర్లు లాటరీ తీయగా మీకు రూ.25 లక్షల ప్రైజ్‌మనీ వచ్చిందని, అది ఇవ్వాలంటే  కొంతనగదు తాము చెప్పిన అకౌంట్లలో డిపాజిట్‌ చేయాలని యువకుడికి చెప్పారు. వారి మాటలను గుడ్డిగా నమ్మిన యువకుడు ఇంట్లో వారికి తెలియకుండా వారు చెప్పిన బ్యాంక్‌ ఖాతాల్లో వివిధ తేదీల్లో రూ.2.11 లక్షల నగదు డిపాజిట్‌ చేశాడు. అప్పటినుంచి సదరు వ్యక్తులకు ఫోన్‌ చేయగా ఆ నంబర్లు పనిచేయలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు నవాబుపేట పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు నవాబుపేట ఇన్‌స్పెక్టర్‌ కె.వేమారెడ్డి తెలిపారు.    

మరిన్ని వార్తలు