పరీక్ష రాసి వస్తుండగా...

8 Mar, 2018 13:27 IST|Sakshi
రోడ్డు పక్కన కాలువలో పడి ఉన్న ఆటో

ఆటో బోల్తా పడి యువకుడి దుర్మరణం

కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు

చీపురుపల్లి: ఆ కుటుంబాన్ని చూసి విధికి కన్ను కుట్టింది. అందుకేనేమో నిండు నూరేళ్లు జీవించాల్సిన యువకుడిని రెండు పదుల వయసు రాకముందే తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లిపోయింది. ఓ వైపు చదువుకుంటూ మరోవైపు ఆటో నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న కొడుకు అకాలమరణంతో కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు. ఇంటర్‌ పరీక్ష రాసిన తర్వాత  తోటి విద్యార్థులతో కొద్దిసేపు గడిపి ఇంటికి వెళ్తున్న విద్యార్థిని ఆటో రూపంలో మృత్యువు కబలించింది.  ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పెదనడిపల్లి గ్రామానికి చెందిన టొంపల కిషోర్‌(19) పట్టణంలోని గాయత్రీ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం (సీఈసీ గ్రూపు) చదువుతున్నాడు. బుధవారం పరీక్ష రాసేందుకు చీపురుపల్లి వచ్చి తిరిగి మధ్యాహ్నం తన స్వగ్రామం వెళ్తుండగా పట్టణ శివారులో కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ సమీపంలో ఆటో బోల్తా పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఏఎస్సై చిన్నారావు సంఘటనా స్థలానికి చేరుకుని కిషోర్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

కుటుంబ పోషణకు ఆటో నడుపుతూ.....
తల్లిదండ్రులు రామారావు, సుభద్రలు కూలీలు కావడంతో కుటుంబపోషణ భారం కిశోర్‌పై పడింది. దీంతో ఓ వైపు చదువుతూ మరోవైపు ఆటో నడుపుతూ కుటుంబ సభ్యులకు చేదోడు, వాదోడుగా ఉంటున్నాడు. కిశోర్‌ పదో తరగతి పూర్తయిన తర్వాత పాలిటెక్నికల్‌ కోర్సు చేశాడు. తర్వాత గాయత్రీ కళాశాలలో ఇంటర్మీడియట్‌లో చేరాడు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తున్నాడు. అయితే బుధవారం పరీక్ష పూర్తయిన అనంతరం అలకనారాయణపురానికి చెందిన స్నేహితుడు శివ, మరికొంతమంది స్నేహితులతో మధ్యాహ్నం మూడు గంటల వరకు గడిపినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తనకు నిద్ర వస్తోందని కిశోర్‌ చెప్పినా స్నేహితులు బలవంతం చేయడంతో ఆటో తీయాల్సి వచ్చింది. దీంతో చీపురుపల్లి నుంచి కనీసం రెండు కిలోమీటర్లు కూడా వెళ్లకముందే ఆటో బోల్తా పడడంతో కిశోర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే అదే ఆటోలో ఉన్న శివకు మాత్రం ఎటువంటి గాయాలవ్వలేదు. శివను పోలీసులు అదుపులోకి తీసుకుని సంఘటన జరిగిన తీరుపై విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు