అమెరికాలో విశాఖ  యువకుడు మృతి

5 Jun, 2019 03:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూజెర్సీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అవినాశ్‌

స్నేహితులతో కలిసి బోటింగ్‌కు వెళ్లిన సందర్భంలో దుర్ఘటన

ఉక్కునగరం(విశాఖపట్నం): అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న విశాఖకు చెందిన ఓ యువకుడు వారాంతపు సెలవులో ఈతకు వెళ్లి అక్కడి సరస్సులో మునిగి మరణించాడు. దీంతో అతని స్వస్థలం విశాఖలోని ఉక్కునగరం ప్రాంతంలో విషాదం నెలకొంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగి కె.వెంకటరావు కుమారుడు అవినాశ్‌ (31) విశాఖలో ఎంసీఏ పూర్తిచేసి ఎంఎస్‌ చేసేందుకు 2014లో అమెరికా వెళ్లాడు. ఎంఎస్‌ పూర్తయిన తరువాత 2016లో న్యూజెర్సీలోని యూనియన్‌ పోస్టల్‌ సర్వీసులో ఉద్యోగంలో చేరాడు. అవినాశ్‌ శనివారం వీకెండ్‌ విహారం కోసం న్యూజెర్సీలోని  హోపట్‌కాంగ్‌ లేక్‌లో బోటింగ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. బోటు నడిపేందుకు లైసెన్స్‌ ఉన్న అవినాశ్‌ బోటును అద్దెకు తీసుకుని స్నేహితులతో కలిసి సరస్సులోకి వెళ్లాడు.

కొంతదూరం వెళ్లాక ఈత కొట్టేందుకు సరస్సులోకి దూకాడు. అక్కడ లోతు 6 నుంచి 7 అడుగులే ఉన్నా.. 3 అడుగుల ఎత్తువరకు కలుపు మొక్కలు ఉండటంతో అందులో చిక్కుకుని మరణించాడు. స్నేహితులు అక్కడి అధికారులకు సమాచారం అందించారు. సరస్సులో గాలించిన న్యూజెర్సీ పోలీసులు సోమవారం అవినాశ్‌ మృతదేహాన్ని వెలికితీశారు. ఈ విషయం ఆదివారం ఉదయం తల్లిదండ్రులకు తెలియడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మే 28న అవినాశ్‌ పుట్టినరోజు వేడుక జరుపుకున్నామని, ఇంతలోనే ఈ దారుణం చోటుచేసుకుందని తల్లిదండ్రులు, సోదరి కన్నీరుమున్నీరవుతున్నారు. న్యూజెర్సీకి సమీపంలో ఉన్న తెలుగు వాళ్లు మృతదేహాన్ని భారత్‌కు తీసుకువచ్చేందుకు అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.  

>
మరిన్ని వార్తలు