అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

15 Jul, 2019 12:13 IST|Sakshi
మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబీకులు  

సాక్షి, సదాశివనగర్‌(నిజామాబాద్‌) : మిషన్‌ భగీరథ అధికారుల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైంది. కరెంట్‌ షాక్‌ రూపంలో యువకుడు అకాల మరణం చెందాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం మండలంలోని మర్కల్‌ మల్లన్న గుట్ట వద్ద గల మిషన్‌ భగీరథ పంప్‌ హౌస్‌లో చోటు చేసుకుంది. రామారెడ్డి మండలంలోని పోసానిపేట్‌ గ్రామానికి చెందిన బొప్పారం నర్సింలు(36) అనే యువకుడు ఆరు నెలలుగా పంప్‌హౌస్‌లో ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో దానికి సమీపంలో ఉన్న పవర్‌ హౌస్‌లో భారీ శబ్ధం వినిపించడంతో అక్కడికి వెళ్లి పవర్‌ను సరిదిద్దుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్‌ షాక్‌ తగిలింది. దీంతో ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోసానిపేట్‌వాసులు పెద్ద ఎత్తున మల్లన్నగుట్టకు తరలివచ్చారు. మృతుడికి భార్య రజిత ఉంది. కుటుంబీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేశ్‌ తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు.  

తరలివచ్చిన ప్రజాప్రతినిధులు 
అధికారుల నిర్లక్ష్యంతోనే నర్సింలు మృతి చెందాడని పోసానిపేట్‌వాసులు భారీగా వచ్చి ఉదయం 11.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఆందోళన చేశారు. బాధిత కుటుంబానికి తగిన పరిహారం చెల్లించాలని శవంతో పంప్‌హౌస్‌ వద్ద బైఠాయించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలన్నారు. ఈ మేరకు పవర్‌హౌస్‌ నుంచి రూ.4లక్షలు, మిషన్‌ భగీరథ పథకం ద్వారా రూ.5లక్షలు అందిస్తామని, మృతుడి భార్య రజితకు మిషన్‌ భగీరథలో ఉద్యోగం కల్పిస్తామని చెప్పడంతో ఆందోళనను విరమించారు. ఘటనా స్థలాన్ని పోసానిపేట్‌ సర్పంచ్‌ గీరెడ్డి మహేందర్‌రెడ్డి, ఎంపీపీ నారెడ్డి దశరథ్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పడిగెల రాజేశ్వర్‌ రావు సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో డీఎస్పీ సత్తన్న, సీఐ రామాంజనేయులు, ఎస్‌ఐ, పోలీసులు పాల్గొన్నారు. 

ప్రాణం ఖరీదు రూ.9లక్షలు..! 
అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి కరెంట్‌ షాక్‌కు గురై చనిపోతే ఆ మనిషి శవాన్ని రూ.9లక్షలు ఖరీదు చేశారు. మని షి విలువ ఇంతేనా అని పలువురు అనుకోవడం చర్చనీయాంశంగా మారింది. మనిషి చనిపోతే బాధిత కుటుంబానికి చెల్లించే పరిహారం ఎందుకు పని చేయదని వారు పేర్కొంటున్నారు. ఈ నిర్లక్ష్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకో వాలని కుటుంబీకులు డిమాండ్‌ చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు