చేపల వేటకు వెళ్లి..

17 Jun, 2018 07:48 IST|Sakshi
సుమన్‌ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబీకులు

జన్నారం(ఖానాపూర్‌) : మరో రెండు రోజుల్లో కానిస్టేబుల్‌ ఉద్యోగం కోసం కోచింగ్‌ వెళ్లే యువకున్ని విద్యుత్‌ షాక్‌ రూపంలో మృత్యువు కబలించింది. ఎదిగిన కొడుకు కుటుంబ బరువు మోస్తాడనే సమయంలో మృత్యువాత పడటంతో ఆ కుటుంబం రోదన మిన్నంటింది. శనివారం జరిగిన ఘటన వివరాలను లక్సెట్టిపేట్‌ సీఐ శ్రీనివాస్, జన్నారం ఎస్సై ఫరీద్‌ వివరించారు. మండలంలోని మొర్రిగూడ గ్రామానికి చెందిన లావుడ్యా కిషన్‌నాయక్, యశోదబాయిలకు ఒక కుమారుడు, ఒక్క కూతురు. కుమారుడు సుమన్‌(23) గత సంవత్సరం డిగ్రీ పూర్తి చేశాడు. శనివారం ఉదయం స్నేహితులు నవీన్, మధు, సురేందర్, రాజు, శ్రీనుతో  కలిసి సరదాగా చేపలు పట్టేందుకు సమీపంలోని బద్దుబాయి పొలంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు.

కర్రకు కరెంటు తీగలు అమర్చి నీటిలో పెట్టి చేపలు చనిపోగానే బయటకు తీస్తారు. ఈ క్రమంలో తీగలు నీటిలో వేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోతూ కుడిచేతితో వైర్‌ను పట్టుకున్నారు. దీంతో షాక్‌ తగిలి అక్కడ సృహ కోల్పోయి పడిపోయాడు. గమనించిన స్నేహితులు వెంటనే జన్నారం ఆసుపత్రికి తరలించారు. వైద్యుడు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. చేతికందిన కొడుకు మృతి చెందడంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. మృతుడికి తల్లిదండ్రులతోపాటు అక్క ఉంది. సంఘటన స్థలాన్ని సీఐ శ్రీనివాస్, ఎస్సై ఫరీద్‌లు పరిశీలించారు. మృతుడి తండ్రి కిషన్‌నాయక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. 

కోచింగ్‌ వెళ్దామనుకుని..
ఇటీవల ప్రభుత్వం కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వడంతో కానిస్టేబుల్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకుని కోచింగ్‌ వెళ్లాలనుకున్నాడు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్‌లో కోచింగ్‌ తీసుకోవడానికి మాట్లాడుకున్నాడు. అయితే రెండు రోజులు సెలవులు రావడంతో సోమవారం కోచింగ్‌ వెళ్దామని ఆగాడు. రోజు క్రికెట్‌ ఆడుకునే కొడుకు ఈ రోజు చేపలకని పోయి కానరాని లోకాలకు వెళ్లాడని కుటుంబీకులు రోదించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. 

 

మరిన్ని వార్తలు