మూడేళ్ల నుంచి బందీగా యువకుడు

11 May, 2018 13:06 IST|Sakshi
గ్రామస్తులు నిర్భంధించిన యువకుడు

విషయం తెలిసి స్పందించిన యంత్రాంగం

ఆస్పత్రికి తరలింపు

జయపురం(ఒరిస్సా) : మానవత్వం మంట గలిసిందనడానికి నిదర్శనంగా నిలుస్తోంది కొరాపుట్‌ జిల్లాలో జరిగిన ఓ సంఘటన. గ్రామస్తుల కఠిన వైఖరితో ఓ యువకుడు(20) మూడేళ్లుగా పశువుల శాల లాంటి గదిలో చేతులకు గొలుసులతో బందీగా ఉన్నాడు.  ఈ  విషయం జిల్లా అధికార యంత్రాం గాన్ని  షాక్‌కు గురి చేసింది. ఈ సంఘటన జిల్లా ప్రజల్లో  తీవ్ర చర్చనీయాంశమైంది. విషయం తెలుసుకున్న వెంటనే  సంబంధిత అధికారులు ఆ యువకుడిని విముక్తిడిని చేసి కొరాపుట్‌ సహిధ్‌ లక్ష్మణ నాయక్‌ వైద్య కళాశాల హాస్పిటల్‌లో చేర్చా రు.

వివరాలిలా ఉన్నాయి. కొరాపుట్‌ జిల్లాలోని దశమంతపూర్‌ సమితి ముజంగ గ్రామ పంచాయతీలోని  మారుమూల గ్రామంలో ఈ సంఘటన వెలుగుచూసింది. గ్రామానికి చెందిన   యువకుడిని   మానసిక వ్యాధి గ్రస్తుడుగా గ్రామస్తులు నిర్ధారించిన తరువాత  గొలుసులతో  బంధించి పశువుల శాల లాంటి ఒక చీకటి గదిలో బంధించారు. ఆ యువకుడి సోదరి ప్రతిరోజూ ఆహారం తీసుకువచ్చి తినిపిస్తోంది. అతని మరో సోదరుడు ఆ గ్రామంలోనే వేరే ఇంటిలో నివాసం ఉంటున్నాడు.

వారి తల్లిదండ్రులు మూడేళ్ల కిందట మరణించారు. తల్లి దండ్రులు ఉన్నంత వరకు ఆ యువకుడు మంచి ప్రవర్తన కలిగి, కూలి పనులు చేస్తుండేవాడు. అయితే తల్లిదండ్రులు పోయిన తరువాత ఆ యువకుడు అంతవరకు పనిచేస్తున్న  కాంట్రాక్టర్‌ దగ్గర పని మానివేశాడు. అందుకు ఆ యువకుడి మానసిక పరిస్థితే కారణమని గ్రామస్తులు అంటున్నారు. నాటి నుంచి  ఆ యువకుడు ప్రజలపైన, ఇళ్ల పైకప్పులపై రాళ్లు విసరడం చేస్తుండేవాడు.

దీంతో ఇళ్లపై వేసిన సిమెంట్‌ రేకులు పగిలిపోవడం, ప్రజలకు దెబ్బలు తగలడం తదితర నష్టాలు సంభవించేవి. ఈ నేపథ్యంలో గ్రామప్రజలు ఏకమై నిర్ణయం తీసుకుని ఆ యువకుడిని బయటకు రాకుండా బంధించాలని తీర్మానించి ఒక ఇంటిలో బంధించి చేతులకు గొలుసులు కట్టి తాళం వేశారు.  ఆ యువకుడిని హాస్పిటల్‌కు కూడా తీసుకువెళ్లకుండా స్థానిక నాటు వైద్యునితో చికిత్స చేయించారు. అయినా ఏమాత్రం నయం కాలేదు. 

పాత్రికేయుని చొరవతో వెలుగులోకి

ఆ ప్రాంతానికి చెందిన ఓ పాత్రికేయుడు ఈ  విషయం తెలుసుకుని వెలుగులోకి తీసుకు రావడంతో జిల్లా అధికారులు వెంటనే స్పందించి వెంటనే విషయం  తెలుసుకోవాలని డీసీపీఓను ఆదేశించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు డీసీపీఓ రాజశ్రీ దాస్‌ వెంటనే ఆ గ్రామానికి వెళ్లి గొలుసులతో కట్టి తాళాలు వేసి బందీని చేసిన  యువకుడిని చూసి గ్రామ ప్రజలతో చర్చించి విషయాలు తెలుసుకున్నారు.

ఆమె ఈ విషయంపై సహిద్‌ లక్ష్మణ్‌  నాయక్‌ వైద్య కళాశాల వైద్యులతో చర్చించగా ఆ యువకుడికి ఉచితంగా వైద్యం చేసేందుకు అంగీకరించినట్లు   సమాచారం. నిరక్షరాస్యత, మూఢాచారాలు, అమాయకత్వం, పేదరికం, తాండవించే మారుమూల గ్రామాల్లో ఇలాంటి అనేక అవాంఛనీయ సంఘటనలు సంభవిస్తుండడం పరిపాటిగా మారింది.

అటువంటి పాంతాలపై పత్రికా రంగం, జిల్లా అధికార యంత్రాంగం, సమాజసేవకులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారిస్తే ఇటువంటి వాటిని అరికట్టవచ్చని సీనియర్‌ పాత్రికేయులు సీహెచ్‌ శాంతాకర్‌ అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా అలాంటి మారుమూల గ్రామాల ప్రజలను చైతన్య పరిచేందుకు సామూహిక ఉద్యమం అవసరమని పలువురు పరిశీలకులు సూచిస్తున్నారు.   

మరిన్ని వార్తలు