రాజీ పేరుతో రప్పించి.. యువకుడి దారుణ హత్య

2 Oct, 2018 09:00 IST|Sakshi
సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న క్లూస్‌ టీం సయీదుద్దీన్‌ మృతదేహం

పాత కక్షలే కారణం

నాంపల్లి: పాత కక్షల కారణంగా ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. రాజీ పేరిట చర్చలకు ఆహ్వానించి అతి కిరాతకంగా నరికి చంపిన సంఘటన నాంపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలోని 21 సెంచరీ బిల్డింగ్‌ సెల్లార్‌లో సోమవారం తెల్లవారుజామున  చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ కనకయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఫస్ట్‌లాన్సర్‌కు చెందిన  సయీదుద్దీన్‌ (23) ఫ్లెక్సీ బోర్డుల ఫిట్టింగ్‌ పని చేసేవాడు.  అదే ప్రాంతానికి చెందిన ఇమ్రాన్, అబ్బూ అతడికి స్నేహితులు. అందరూ కలిసి  జల్సా చేసేవారు. అయితే కొన్నాళ్ల క్రితం వీరి మధ్య విబేధాలు రావడంతో సయీదుద్దీన్, ఇమ్రాన్‌ రెండు గ్రూపులుగా విడిపోయారు. దీంతో సయీదుద్దీన్‌ను అంతం చేయాలనుకున్న ఇమ్రాన్‌ అందుకు పథకం పన్నాడు. ఇందులో భాగంగా అబ్బూ ద్వారా సయీదుద్దీన్‌ను రాజీకి పిలిపించాడు. ఇందుకు 21 సెంచరీ బిల్డింగ్‌లోని సెల్లార్‌ను వేదికగా నిర్ణయించారు.

సయీదుద్దీన్‌ అక్కడికి చేరుకునే సరికి ఇమ్రాన్, అబ్బూలతో పాటు మరో ఇద్దరు అనుచరులు అక్కడ సిద్ధంగా ఉన్నారు. అందరూ కలిసి మద్యం తాగారు. మద్యం మత్తులో ఉన్న సయీద్‌పై ఇమ్రాన్, అబ్బూ అనుచరులతో కలిసి  కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెండదంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దీనిపై సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్‌ టీమ్, డాగ్‌ స్వా్కడ్‌లతో ఆధారాలు సేకరించారు. మధ్య మండలం డీసీపీ విశ్వ ప్రసాద్, సైఫాబాద్‌ ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ కనకయ్యలతో సంఘటనాస్థలాన్ని సందర్శించారు. సీసీ కెమెరా పుటేజీ  ఆధారంగా నిందితులను గుర్తించారు. వారిని పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేసినట్లు డీసీపీ తెలిపారు. కాగా ప్రధాన నిందితులు ఇమ్రాన్, అబ్బూలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సయీదుద్దీన్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ కనకయ్య నేతృత్వంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు