యువకుడి దారుణ హత్య

2 Nov, 2018 06:43 IST|Sakshi
సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

మారణాయుధాలతో గుర్తు తెలియని వ్యక్తుల దాడి

శోక సంద్రంలో మర్రిపాలెం

విశాఖ, రోలుగుంట(చోడవరం):  మండలంలో ఎంకే పట్నం శివారు సింగరాజుపేట సమీపంలో పెదపేట కూడలి వద్ద ఓ వ్యక్తిపై  గుర్తు తెలియని కొంతమంది ఆయుధాలతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. దీనికి సంబంధించి పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాతవరం మండలం మర్రిపాలెం గ్రామానికి చెందిన చింతల అప్పలనాయుడు  రోలుగుంట మండలం ఎం.కె.పట్నం శివారు సింగరాజుపేట సమీపంలో పెదపేట కూడలి దగ్గర గల  తాటికొండ పార్వతికి చెందిన 71/1 సర్వే నంబర్‌లో గల సుమారు ఏడు ఎకరాల జామతోటను,  గొలుగొండ మండలంలో గింజర్తికి చెందిన సుమారు ఆరు ఎకరాల జామతోటను  ఆరు సంవత్సరాలుగా  కౌలుకి చేస్తున్నాడు.  తన కుమారుల్లో  పెద్ద  కుమారుడు సత్తిబాబుకు రోలుగుంట మండలం సింగరాజుపేట సమీపంలో గల జామతోటను, గొలుగొండ మండలం గింజర్తి గ్రామంలో గల జామ తోటను చిన్న కుమారుడు నానాజీ (30)కి అప్పగించాడు.

వాటి ఫలసాయంతో వ్యాపారం చేస్తూ జోవనోపాధి పొందుతున్నా రు.   సత్తిబాబు తన తమ్ముడు నానాజీకి కబురు చేసి, తాను ఊరు వెళ్తున్నానని  తోట వద్ద కాపలాకు  రావాలని  కోరాడు. దీంతో నానాజీ బుధవారం సాయంత్రం 4 గంటలకు అన్న చూస్తున్న జామతోట వద్దకు వచ్చాడు. ఆ రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో ఇద్దరు అన్నదమ్ములు ఫోన్‌లో మాట్లాడుకున్నారు.  పని ముగించుకుని గురువారం సత్తిబాబు జామతోట వద్దకు  వెళ్లగా  నానాజీ రక్తపు మడుగులో పడి ఉన్నాడు.  తలపై ఆయుధాలతో దాడి చేయడంతో మృతి చెందినట్టు గుర్తించి, తీవ్ర ఆందోళన చెంది, వెంటనే తన తండ్రికి కబురు చేశాడు.  మృతుడి తల్లిదండ్రులు, భార్య ఇక్కడకు వచ్చి నానాజీ మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు.  తన రెండవ కుమారుడు చనిపోయిన విషయాన్ని   అప్పలనాయుడు గురవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ మేరకు ఎస్‌ఐ  సీహెచ్‌ హరికృష్ణ ... ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నర్సీపట్నం సీఐ రేవతమ్మకు   తెలియజేసి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీంచారు. స్థానికులను, మృతుడి కుటుంబ సభ్యులను విచారించారు.   డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించి  పరిశీలించారు.   శవపంచనామా నిర్వహించి, నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం మృతదేహన్ని తరలించారు.

మాకు దిక్కెవరు...
నానాజీ మృతి విషయం తెలిసిన మర్రిపాలెం గ్రామస్తులు శోకసంద్రంలో మనిగిపోయారు. మృతుడికి భార్య,  మూడు సంవత్సరాల కుమార్తె ఉన్నారు. భర్త మరణంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. తనకు, తన కుమార్తెకు దిక్కు ఎవరని ఆమె రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.

మరిన్ని వార్తలు