చోరీకి నిరాకరించాడని.. నమ్మించి ప్రాణం తీశారు

24 Aug, 2019 11:16 IST|Sakshi

సాక్షి, రెబ్బెన(ఆసిఫాబాద్‌) : మద్యం సేవిద్దామని యువకుడిని ఇంట్లో నుండి బయటకు తీసుకువచ్చి మద్యం సేవించిన అనంతరం కిరాతంగా దాడి చేసి ప్రాణాలు తీశారు. గూడ్స్‌ రైలులో నుండి బస్తాలు దొంగతనం చేద్దామని తోటి స్నేహితుడిని కోరడంతో నిరాకరించిన పాపానికి విచక్షణ రహితంగా దాడి చేయటంతో తీవ్ర గాయాలపాలైన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు. జీఆర్పీ ఖాజీపేట సీఐ కే. స్వామి తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రం లోని ఇందిరా కాలనీకి చెందిన ఆత్రం రమేష్‌ (19) కూలి పనులు చేసుకుంటూ జీవించేవాడు. 14న రాత్రి మండల కేంద్రానికి చెందిన రమేష్‌తో పాటు మరో స్నేహితుడు కలిసి ఆసిఫాబాద్‌ రోడ్‌ రైల్వేస్టేషన్‌లో గూడ్స్‌ రైలులో నుండి బస్తాలు దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు.

దాంతో వీరిద్దరు కలిసి ఆత్రం రమేష్‌ ఇంటికి వెళ్లి రైలులో నుండి బస్తాలు దొంగతనం చేద్దామని పిలిచారు. దానికి  ఆత్రం రమేష్‌ నిరాకరించటంతో వారు అక్కడి నుండి వెళ్లిపోయారు. కొద్ది సేపటి తరువాత మరోసారి ఆత్రం రమేష్‌ ఇంటికి వెళ్లి మద్యం సేవిద్దామని ఇంట్లో నుండి ఆయనను బయటకు తీసుకువచ్చారు. ముగ్గురు కలిసి మద్యం సేవించిన అనంతరం గూడ్స్‌ రైలులో నుండి బస్తాలు దొంగతనం చేద్దామని ఆత్రం రమేష్‌కు తెలపటంతో దానికి ఆయన నిరాకరించాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన  రమేష్‌తో పాటు మరో వ్యక్తి ఆత్రం రమేష్‌ను వెనుక వైపు నుండి కాలితో బలంగా తన్నటంతో రైల్వేస్టేషన్‌లో ఉన్న సిమెంట్‌ బెంచీపై పడ్డాడు.

దాంతో ఆత్రం రమేష్‌ మెడ నరాలు తెగిపోగా శరీరంలో అంతర్గతంగా తీవ్రగాయాలై అక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన మిగిలిన ఇద్దరు అక్కడి నుండి పారిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న రమేష్‌ను గమనించిన పలువురు వెంటనే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియ జేయడంతో హుటాహుటిన బెల్లంపల్లికి అక్కడి నుండి మంచిర్యాలకు తరలించారు. పరిస్థితి విషమంగా మారటంతో హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు ఈమేరకు మృతుడి అన్న ఆత్రం వినోద్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.     

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా