నా బిడ్డ భద్రం.. నేను చనిపోతున్నా!

8 Jul, 2019 11:02 IST|Sakshi
రోదిస్తున్న బొమ్మిడి శృతిక (కూతురు )

తన కూతురు శృతికకు న్యాయం చేయాలని ఫోన్‌ వీడియోలో అడిషనల్‌ డీసీపీ, ఎస్‌ఐలను కోరిన బాధితుడు.. ఆపై ఆత్మహత్య 

 సాక్షి, బెజ్జంకి(సిద్దిపేట): వరకట్నం కేసులో శిక్ష పడుతుందని భయంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని దాచారం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బొమ్మిడి సతీష్‌ (28) కు రాజన్న సిరిసిల్లా జిల్లా చందనంపేటకు చెందిన మహేశ్వరితో 2011లో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె శృతిక(6) ఉంది. కూలీ పని చేసి జీవించేవారు.

2017లో భార్యా భర్తలకు గొడవ జరిగి మహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో సతీష్‌పైన వరకట్నం కేసు నమోదై కోర్టులో కొనసాగుతుంది. ఇటీవలె కేసులో కాంప్రమైస్‌ కావాలని అత్తింటి వారిని వెళ్లి సతీశ్‌ పలుమార్లు అడుగగా వారు ఒప్పుకోలేదు.  దీంతో శిక్ష పడుతుందేమో అని మనస్థాపానికి గురై  శనివారం ఇంటి నుంచి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్టు సతీష్‌ కుటుంబ సభ్యులు తెలిపారు.  మాకు ఎవరి పైన అనుమానం లేదు. వరకట్న కేసులో శిక్ష పడుతుందేమోనని భయంతో ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దరాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అభిలాశ్‌ తెలిపాడు.   

గ్రామస్తులను కలిచి వేసిన ఘటన 
తాను చావడానికి సిద్ధంగా ఉన్నానని తన కూతురును ఆదుకోవాలని సతీష్‌ మరణించే ముందు ఫోన్‌లో వీడియో తీసి సిద్దిపేట అడిషనల్‌ డీసీపీ నర్సింహారెడ్డి, బెజ్జంకి ఎస్‌ఐ అభిలాశ్‌ను కోరాడు. ఈ వీడియోలో అతని వేదనను చూసి గ్రామస్తులు ఆవేదనకు గురయ్యారు. 6సంవత్సరాల చిన్నారి కోసం అతని తపన గ్రామస్తులను కలిచి వేసింది. 

మరిన్ని వార్తలు