పీక కోసుకొని...

26 Jan, 2018 12:18 IST|Sakshi
రక్తపుమడుగులో సురేష్‌ మృతదేహం మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ త్రివిక్రమవర్మ

యువకుడు ఆత్మహత్య ∙నిర్ధారించిన పోలీసులు

అనుమానాలు వ్యక్తం చేస్తున్న స్థానికులు

సోంపేట: సోంపేట పట్టణంలో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. తన ఆరోగ్యం బాగోలేదని, తనకు ధైయ్యం పట్టినట్టు ఉందని కుటుంబ సభ్యులకు చెబుతూనే పీక కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో గురువారం తెల్లవారుజామున పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రధాన రహదారిలో మసీదుకు ఎదురుగా ఓ యువకుడు రక్తపుమడుగులో పడి ఉన్నాడనే వార్త దావానంలా వ్యాపించడంతో, సంఘటనా స్థలానికి స్థానికులు, పోలీసులు పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించి సోంపేట పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. లావేరు మండలం బుడుమూరు పంచాయతీ బొంతువలస గ్రామానికి చెందిన అల్లంశెట్టి కేశవరావు కుమారుడు సురేష్‌(30) ఆత్మహత్య చేసుకొన్నాడు. సురేష్‌ గతంలో అరబిందో కంపెనీలో విధులు నిర్వహిస్తూ మద్యంకు బానిస కావటంతో కంపెనీవారు ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో సురేష్‌ను అతని చిన్నాన్న, మురపాక గ్రామానికి చెందిన నారాయణరావు రెండు నెలల క్రితం సోంపేట పట్టణంలోని శ్రీలక్ష్మీ గణపతి కనస్ట్రక్షన్స్‌ అండ్‌ ఫైనాన్స్‌ కంపెనీలో విధుల్లో చేర్పించారు. ఇక్కడ రెండు నెలల పాటు సురేష్‌ సక్రమంగానే విధులు నిర్వహించాడు.

సంక్రాంతికి ఇంటికి వెళ్లిన సురేష్‌ రెండు రోజుల క్రితం తిరిగి సోంపేటలో తాను నివసిస్తున్న అద్దె ఇంటికి చేరుకొన్నాడు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో సురేష్‌ తన చిన్నాన్నకు ఫోన్‌ చేసి ఆరోగ్యం బాగోలేదని, దెయ్యం పట్టినట్టు అవుతుందని వాపోయాడు. సోంపేటలోనే ఉంటున్న అతని చిన్నాన్న వెంటనే సురేష్‌ దగ్గరికొచ్చి సముదాయించడానికి ప్రయత్నం చేశాడు. నన్ను పట్టుకొంటే ఆత్మహత్య చేసుకొంటానని బెదిరించడంతో నారాయణరావు చేసేదిలేక సురేష్‌ను విడిచిపెట్టాడు. ఇదే విషయాన్ని సురేష్‌ తండ్రి కేశవరావుకు ఫోన్‌ ద్వారా తెలియజేశాడు. దీంతో మృతుని తండ్రి కేశవరావు అప్పటికప్పుడు అర్ధరాత్రే స్వగ్రామం నుంచి బయలుదేరి గురువారం వేకువజామున సోంపేట చేరుకొన్నాడు. అయితే అప్పటికే సురేష్‌ పీకను కోసుకొని మృతిచెందాడు. తండ్రి కేశవరావు, చిన్నాన్న నారాయణరావు సురేష్‌ మృతదేహాన్ని చూసి గుండెలు బాదుకొని రోదించారు.

ఎస్పీ త్రివిక్రమవర్మ పరిశీలన
విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ త్రివిక్రమవర్మ సోంపేట సామాజిక ఆస్పత్రిలో సురేష్‌ మృతదేహాన్ని, సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇది ఆత్మహత్యేనని స్పష్టంచేశారు. స్థానిక వైద్యుల శవపంచనామా నివేదిక ఆధారంగా ఇది ఆత్మహత్యగా నిర్ధారించామన్నారు. మృతుని కుటుంబ సభ్యులు కూడా ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదని తెలిపారు. పోలీసులు ఆత్మహత్యగా నిర్ధారిస్తున్నప్పటికీ సోంపేట పట్టణంలో మాత్రం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోంపేట సీఐ సన్యాసినాయుడు, ఇచ్ఛాపురం సీఐ అవతారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు