అయ్యో.. గణేశా!

27 Sep, 2018 08:00 IST|Sakshi
నదిలోంచి మృతదేహాలను ఒడ్డుకు చేర్చుతున్న గజ ఈతగాళ్లు, సాయిరాం, రాజ్‌కుమార్‌ మృతదేహాలు

ఇటిక్యాల (అలంపూర్‌) : జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణానదిలో బుధవారం నిర్వహించిన గణేశ్‌ నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. రెండు మూడు రోజులుగా హైదరాబాద్, కర్నూలు, ఇతర ప్రాంతాలనుంచి కృష్ణానదిలో వినాయకులను నిమజ్జనం చేయడానికి భక్తులు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌ మస్తాన్‌నగర్‌కు చెందిన 22 మంది యువకులు  విగ్రహాన్ని బీచుపల్లి వద్ద కృష్ణానదిలో నిమజ్జనం చేసేందుకు ఉదయం 8.15 గంటలకు బీచుపల్లికి చేరుకున్నారు. వారి వెంట వచ్చిన సాయిరాం (18), రాజ్‌కుమార్‌ (18)లు సైతం పుష్కరఘాట్లపై నుంచి విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసేందుకు నదిలోకి దిగారు.   10 అడుగుల ఎత్తు ఉన్న విగ్రహాన్ని అందరు కలిసి ఎత్తుకోని పుష్కరఘాట్ల మేట్లపై నుంచి నదిలోకి వదిలేందుకు వెళ్లారు. ఘాట్లపై నీరు 4 ఫీట్ల ఎత్తులోనే ఉండగా పెద్ద విగ్రహం కావడంతో నదిలోకి ఎక్కువ దూరం వెళ్లారు. లోతు అధికంగా ఉన్న విషయం తెలియక ఈత రాని ఇద్దరు గల్లంతయ్యారు. ఎవరూ గమనించకపోవడంతో ఆ విషయం తోటి స్నేహితులు పసిగట్టలేకపోయారు.

మృతదేహాలను ఒడ్డుకు చేర్చిన గజ ఈతగాళ్లు  
నదిఒడ్డున వచ్చిన యువకకులు కాసేపటి తర్వాత ఆందోళనకు గురయ్యారు. నదిలో దిగిన వారిలో ఇద్దరు ఇంకా రాలేదని.. నీటిలోనే మునిగిపోయి ఉంటారని కేకలు పెట్టారు. అక్కడున్న వారు గజ ఈతగాళ్లను పిలిచి విషయాన్ని చెప్పారు. వెంటనే వారు నదిలో దిగి ఇద్దరి మృత దేహలను ఒడ్డుకు చేర్చారు. విషయం తెలుసుకున్న అలంపూర్‌ సీఐ రజితారెడ్డి, ఇటిక్యాల ఎస్‌ఐ జగదీశ్వర్‌ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. తోటి స్నేహితులు జరిగిన సంఘటన గురించి కుటుంబసభ్యులకు తెలిపారు. మృతదేహాలను చూసి స్నేహితులు బోరున విలపించారు. 
 
అవగాహన లేకే ప్రమాదం 
సోమ, మంగళ, బుధవారాల్లో ఎలాంటి ప్రమాదా లు జరుగకపోయినా నదిలో ఉన్న లోతు తెలియక చాలామంది ఇబ్బంది పడ్డారు. బుధవారం ఉద యం జరిగిన ప్రమాదానికి నది లోతు తెలియకపోవడం, దానికి తోడు వారికి ఈత రాకపోవడం, నీటి లో పడిపోయినప్పుడు ఎవరూ గమనించకపోవడం ప్రమాదానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.  

ఇదే మొదటి ప్రమాదం 
బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద ప్రతియేటా వేలసంఖ్యలో గణేష్‌ విగ్రహాలను కృ ష్ణానదిలో నిమజ్జనం చేస్తారు. పుణ్యక్షే త్రం వద్ద ఇప్పటివరకు ఎలాంటి అప శ్రుతి చోటుచేసుకోలేదు. యువకుల తప్పిదం వల్ల మొదటిసారి ప్ర మాదం చోటుచేసుకోవడంతో బీచుపల్లి వద్ద విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ఏడాది మొత్తం 1004 వినాయక విగ్రహాలను అధికారుల సమక్షంలో నిమజ్జనం చేశారు. రెండురోజుల క్రితమే నిమజ్జన కార్యక్రమం ముగియడంతో సంఘటన జరిగినప్పుడు అధికారులు ఎవరూ అక్కడ లేరు. 

మృతదేహాల అప్పగింత 
గద్వాల క్రైం: వినాయకుని నిమజ్జనం చేసేందుకు హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు నదిలో మునిగి మృతి చెందగా పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం  మృతదేహాలను గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇటిక్యాల పోలీసుల సమక్షంలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి స్నేహితులకు అప్పగించారు. ఇదిలాఉండగా మృతి చెందిన ఇద్దరు యువకులు హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌లో ఎన్‌ఆర్‌ఐ కాలేజీలో ఇంటర్‌  చదువుతున్నారు.  

మరిన్ని వార్తలు