ప్రేమించి మోసం చేసిన ప్రియుడు  

22 Jun, 2018 11:38 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంధ్య

 పెద్దల సమక్షంలో తేలని పంచాయితీ

పోలీసులను ఆశ్రయించిన యువతి

సూసైడ్‌నోట్‌ రాసి  ఆత్మహత్యాయత్నం

మంచిర్యాలక్రైం : వారిద్దరు రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. మూడుముళ్ల బంధంతో ఇరువురు ఒక్కటవుదామని ఆశపడితే తల్లితండ్రులు కాదని చెప్పడంతో ప్రేమకథ ఊరి పెద్దల వద్దకు  చేరుకుంది. వరుని తల్లిదండ్రులు నిరాకరించడంతో పెద్దలు చేతులెత్తేసారు. న్యాయం చేయాలని యువతి పోలీసు బాసును కలిసి కోరడంతో కేసును స్థానిక ఏసీపీకి రెఫర్‌ చేశారు.

గురువారం ఉదయం ఏసీపీ వద్దకు వెళ్లగా మధ్యలో దూరిన కొంతమంది పెద్ద మనుషులు, ప్రజాప్రతినిధులు యువతికి న్యాయం జరగకుండా అడ్డుకోవడంతో చేసేదేమిలేక పోలీసులు కూడా మిన్నకుండిపోయారు. దీంతో మనస్తాపం చెందిన యువతి గురువారం ఆత్మహత్యకు యత్నించి మృత్యువుతో పోరాడుతోంది. 

వివరాల్లోకి వెళ్తే...

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంట్రాక్ట్‌ బస్తీకి చెందిన బామండ్లపెల్లి సంధ్యరాని హన్‌మన్‌బస్తీకి చెందిన గడ్డం రవితేజ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారిప్రేమకు రవితేజ తల్లిదండ్రులు అడ్డుపడుతుండడంతో పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. అయినా రవితేజ తల్లితండ్రులు ఒప్పుకోకుండా రూ.10లక్షలు కట్నం తీసుకస్తేనే పెళ్లి చేస్తామని యువతిని బెదిరింపులకు గురిచేశారు.

దీంతో రామగుండం పోలీస్‌ కమిషనర్‌ విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌ను కలిసి న్యాయ చేయాలని వేడుకుంది. భరోసా కల్పించిన సీపీ కేసును బెల్లంపల్లి ఏసీపీ బాలుజాదవ్‌ వద్దకు పంపించాడు. ఎట్టకేలకు గురువారం ఏసీపీ ఇరువురిని పిలిపించి మందలించాడు. సంధ్యను వివాహం చేసుకోవాలని సూచించాడు. అయినా వారు సమాధానం చెప్పకుండా వెళ్లి పోయారు. దీంతో ఎక్కడా న్యాయం జరగలేదని మనస్తాపం చెందిన సంధ్య ఇంటికి వెళ్లి  సూసైడ్‌ నోట్‌ రాసి సూపర్‌ వాస్‌మల్‌ 33 తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

సూసైడ్‌ నోట్‌లో ఏముంది?

‘అమ్మా, నాన్న.. నన్ను క్షమించండి. నేను తేజ లేకుండా బతకలేను. తేజ వస్తాడనుకున్నా. కానీ వాళ్ల అమ్మానాన్నలకు భయపడి నన్ను వదులుకుంటాడని అనుకోలేదు. అందుకే నేను చావాలని అనుకున్నా. పెద్దమనుషులు నాకు న్యాయం చేస్తారని అనుకున్నా. కానీ చేయలేదు. పోలీసులైనా న్యాయం చేస్తారనుకున్నా. అక్కడ కూడా నాకు న్యాయం జరుగలేదు.

దీనంతటికి కారణం పెద్ద మనుషులు కుసుమ మధుసూదన్, రాజేష్, తేజ తల్లిదండ్రులు లక్ష్మీ, రమేష్‌. వీళ్లంతా ఉండగా నాకు న్యాయం జరుగదమ్మా. అందుకే చావాలనుకున్నా. నువ్వేం బాధపడకమ్మా. డాడీని బాగా చూసుకో.. మీరు బాగుండండి.  ఐలవ్‌యూ అమ్మ, ఐమిస్‌యూ అమ్మ ఇట్లు నీ కూతురు సంధ్య

మరిన్ని వార్తలు