ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని యువతి ఆత్మహత్య

4 Jan, 2020 12:29 IST|Sakshi

గుంటూరు ఈస్ట్‌: ప్రేమించిన వ్యక్తి తనను కాదని వేరే యువతితో వివాహానికి సిద్ధమవడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పాతగుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌హెచ్‌ఓ సురేష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. పాతగుంటూరు పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ కాలనీకి చెందిన యువతి ఎంబీఏ పూర్తి చేసింది. తూర్పు గోదావరి జిల్లా కె.సముద్రం మండలానికి చెందిన ఓ యువకుడు గుంటూరు నగరంలోని ఓ ఫార్మసీ కళాశాలలో నాలుగు సంవత్సరాల క్రితం బీఫార్మసీ చదువుతూ ప్రతి ఆదివారం యువతి ఇంటి సమీపంలోని చర్చికి వచ్చేవాడు. ఇద్దరి మధ్య నెలకొన్న స్నేహం ప్రేమగా మారింది. చదువు పూర్తి అయిన తరువాత యువకుడు దుబాయ్‌లో ఉద్యోగంలో చేరాడు. ఇద్దరు ఫోన్‌లో తరచూ మాట్లాడుకుంటూ తమ ప్రేమను కొనసాగించారు. యువకుడు ఇటీవల దుబాయ్‌ నుంచి సొంత ఊరికి వచ్చాడు. సమాచారం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులను తీసుకుని డిసెంబరు 26వ తేదీ యువకుడి ఇంటికి వెళ్లింది. యువకుడి తల్లిదండ్రులతో వివాహ విషయం ప్రస్తావించారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో యువకుడి తల్లిదండ్రులు వివాహం విషయం కొంతకాలం తరువాత చర్చిద్దామని చెప్పి పంపించారు.

యువకుడు తన సెల్‌లో ప్రియురాలి నంబరు బ్లాక్‌ చేశాడు. అయితే ఆ యువకుడికి మరో యువతితో వివాహం నిశ్చయమైందని సమాచారం తెలుసుకున్న యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. శుక్రవారం కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో యువతి చీరతో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి సెల్‌ నంబరు ప్రియుడు బ్లాక్‌ చేయడంతో సూసైడ్‌ మెసేజ్‌ అతని ఫ్రెండ్‌ ఫోన్‌కు పంపింది. తన ప్రియుడు లేని జీవితాన్ని తాను ఊహించలేనని పేర్కొంది. మరో వ్యక్తిని భర్తగా అంగీకరించలేనని,   ఆ కారణంగా తల్లిదండ్రులకు తాను భారమవుతానని భావించానని రాసింది. వచ్చే జన్మలోనైనా నీవు నాకు దక్కుతావా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తాను మృతి చెందిన అనంతరం మృతదేహాన్ని చూడడానికి కూడా నువ్వు రావులే అంటూ తన ఆవేదనను వెలిబుచ్చింది. పెళ్లి కానుకగా తాను కొన్న వాచీని స్వీకరించాలని అభ్యర్థిచింది. మెసేజ్‌ చేరిన కొంతసేపటికే తాను ప్రాణాలను విడుస్తున్నట్లు, తనను రక్షించేందుకు ప్రయత్నించినా ప్రయోజనం ఉండదని తెలిపింది.

మరిన్ని వార్తలు