తల్లి మందలించిందని యువతి ఆత్మహత్య

4 Sep, 2019 07:55 IST|Sakshi
సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు నుంచి మృతదేహాన్ని బయటకు తీసుకువస్తున్న అగ్నిమాపక సిబ్బంది

సమ్మర్‌ స్టోరేజీలో దూకి..

గాలించి మృతదేహాన్ని వెలికితీసిన అగ్నిమాపకశాఖ

సాక్షి, ఒంగోలు: తల్లి మందలించిందని మనస్తాపంతో ఓ యువతి మామిడిపాలెం వద్ద ఉన్న ఒకటో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులో దూకి ఆత్మహత్యచేసుకుంది. ఈ ఘటనలో స్థానిక విజయనగర్‌ కాలనీకి చెందిన గుంజా రేణుక(20) మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. యువతి సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులోకి దూకి పెద్దగా కేకలు వేస్తున్న సమయంలో సుదూరంగా ఉత్తరం దిక్కులో కట్టమీద ఉన్న ఓ వ్యక్తి గమనించి పరుగు పరుగుల వచ్చి చిన్నకర్ర సాయంతో ఆమెను కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ కుదరకపోవడంతో అతను చూస్తుండగానే ఆమె మునిగిపోయింది.

దీంతో డయల్‌ 100కు సమాచారం అందించడంతో తాలూకా పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని యువకున్ని విచారించారు. యువతి మునిగిపోయే ముందు ఒడ్డుమీద ఉంచిన వస్తువులను స్వాధీనం చేసుకొని ఆమె కోసం అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. దీంతో వారు చెరువు వద్దకు చేరుకొని బోటుసాయంతో చెరువులో గాలించారు. గంట పాటు గాలించిన అనంతరం యువతి మృతదేహాన్ని బయటకు తీశారు. కుమార్తె మృతిచెందిన విషయం తెలుసుకున్న నాగేంద్రమ్మ, ఆమె కుమారుడు , వారి బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.

అసలు ఏం జరిగిందంటే..?
స్థానిక విజయనగర్‌ కాలనీకి చెందిన నాగేంద్రమ్మకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఆమె భర్తకు దూరంగా ఉంటూ బిడ్డలతో కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఈ క్రమంలో సోమవారం వినాయక చవితి పర్వదినం సందర్భంగా నాగేంద్రమ్మ కుమార్తె రేణుక వినాయక మండపం వద్ద నృత్య ప్రదర్శన చేసింది. ఈ విషయం తల్లికి తెలియడంతో ఆమె మందలించింది. మంగళవారం ఉదయం నాగేంద్రమ్మ రేణుకు సర్దిచెప్పి టీ పెట్టి ఇచ్చింది. అనంతరం సైకిల్‌కు ఎక్కి అమ్మా వెళ్లొస్తా అంటూ తాను నిత్యం వేరే వాళ్ల ఇళ్లల్లో చేసే పనులకు బయల్దేరింది. అనంతరం సైకిల్‌మీద సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు వద్దకు వచ్చి సైకిల్‌ను కట్ట వద్ద పార్కు చేసి చున్నీపై తన తల్లి నాగేంద్రమ్మ ఫొటో ఉంచి అనంతరం సమ్మర్‌స్టోరేజీ ట్యాంకులో దూకి ఆత్మహత్య చేసుకుంది.

తల్లి ఫోటోనే ఆధారంగా..
సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకుకు సమీపంలోనే విజయనగర్‌ కాలనీ ఉండండం, కట్టమీద రేణుక వదిలిన తల్లి పాస్‌పోర్టు ఫొటో ఉండటంతో ఆమె ఎవరనేది గుర్తించేందుకు సాధ్యపడింది. విజయనగర్‌ కాలనీకి చెందిన పలువురు ఎవరో యువతి ఆత్మహత్య చేసుకుందని తెలిసి అక్కడకు చేరుకొని నాగేంద్రమ్మ ఫొటో చూసి గుర్తుపట్టి ఆమెను చెరువు కట్టవద్దకు తీసుకువచ్చారు. కూతురు మృతదేహాన్ని చూసి నాగేంద్రమ్మ బోరున విలపించింది. తాలూకా ఎస్సై దేవకుమార్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్న విషయానికే ఆత్మహత్య చేసుకున్న రేణుక ఘటనను తలుచుకొని అక్కడకు చూసేందుకు వచ్చిన అందరి హృదయాలు కలతకు గురయ్యాయి.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా