ఆశలను చిదిమేసిన మృత్యువు

29 Jan, 2020 07:04 IST|Sakshi
సాయి దీపికారెడ్డి (ఫైల్‌), ఘటనస్థలంలో ఆర్టీసీ బస్సు

ఆర్టీసీ బస్సు ఢీకొని యువతి దుర్మరణం

నిశ్చితార్థం జరగాల్సిన ఇంట్లో విషాదం

కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబం

డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు  

అమీర్‌పేట: ఆ యువతికి మరో రెండు రోజుల్లో వివాహ నిశ్చితార్థం జరగనుంది. అంతలోనే ఆమెను ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ఆనందం వెల్లివిరియాల్సిన ఆ ఇంట్లో విషాదాన్ని నింపింది. మృతురాలి కుటుంబ సభ్యులకు కన్నీటి సంద్రంలో ముంచింది. ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో యువతి దుర్మరణం పాలైన ఘటన మంగళవారం ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. పెద్దఅంబర్‌పేటకు చెందిన లక్ష్మీరెడ్డికి ఇద్దరు కూతుళ్లు. చిన్న కుమార్తె సాయి దీపికారెడ్డి (24) ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. సనత్‌నగర్‌లో స్నేహితులతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో దీపిక మంగళవారం ఉదయం 8.30 గంటల సమయంలో తన ద్విచక్రవాహనంపై విధులకు బయలుదేరింది.

అమీర్‌పేట మైత్రీవనం నుంచి యూసుఫ్‌గూడ మీదుగా జూబ్లీహిల్స్‌లోని కార్యాలయానికి వెళుతుండగా స్టేట్‌ హోం సమీపంలో వెనక నుంచి వచ్చిన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. బస్సు వెనక చక్రాలు పైనుంచి వెళ్లడంతో దీపి క అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై నరేష్‌ ప్రమాద కారణాలపై విచారణ జరిపి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. మృతురాలి మామ రవీందర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బస్సు డ్రైవర్‌ అబ్దుల్‌ రవూఫ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని చెప్పారు. దీపిక వెళుతున్న యాక్టివా వాహనం అదుపు తప్పి బస్సు కిందకు వెళ్లిందా.. లేక డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణమా? అనే కోణాల్లో కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై నరేష్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు