ఉపాధి ఎరగా.. వ్యభిచార కూపంలోకి.. 

15 Jun, 2020 07:43 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, విశాఖపట్నం : నగరానికి చెందిన ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులు.. కృష్ణా జిల్లాకు చెందిన మరో యువతిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపారు. ఉపాధి కల్పిస్తామని నమ్మించి ఇక్కడికి తీసుకొచ్చి ఆమె జీవితాన్ని నరకంగా మార్చారు. చివరకు ఆమె గాజువాక పోలీసులను ఆశ్రయించడంతో ఐదుగురు నిందిఉతులను అరెస్టు చేశారు. గాజువాక పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా గుడివాడ దరి ధనియాలపేటకు చెందిన ఓ యువతి(19) చదువును మధ్యలో ఆపేసి ఒక కిరాణా దుకాణంలో పని చేసేది. ఈ ఏడాది జనవరి 1న తల్లితో గొడవ పడి ఆమె కలువపూడిలోని తన తాతగారి ఇంటికి వెళ్లడం కోసం బయల్దేరింది. కలువపూడికి బదులు వేరే రైలు ఎక్కేయడంతో తిరుపతికి చేరుకుంది.

అక్కడ రైల్వే స్టేషన్‌లో విశాఖకు చెందిన బి.ఉమామహేశ్వరి పరిచయమైంది. విశాఖలో పని ఇప్పిస్తానని ఆమె చెప్పడంతో ఆ యువతి ఇక్కడికి వచ్చేసింది. మధురవాడలోని వాంబే కాలనీలో తన ఇంటికి తీసుకొచ్చిన యువతిని ఉమామహేశ్వరి తన బంధువుతో వ్యభిచారానికి దింపింది. అతను తన నలుగురు స్నేహితులతో కలిసి యువతిపై అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని బాధితురాలు ఉమామహేశ్వరి మరదలు గౌరీలక్ష్మికి తెలిపింది. దీంతో తన చెల్లెలు కుమారి వద్ద పని ఉందని చెప్పి పంపించింది. ఆమె కూడా ఈ యువతితో బలవంతంగా వ్యభిచారం చేయించింది. ఈ నేపథ్యంలో వాసిరెడ్డి సతీష్‌ అనే వ్యక్తి కుమారి వద్దకు వెళ్లాడు. తాను పోలీసునని యువతికి చెప్పాడు. దీంతో ఈ నరకం నుంచి తనను బయట పడేయమని అతడిని బాధితురాలు వేడుకొంది.

దీంతో గాజువాక శ్రీనగర్‌ దరి అఫీషియల్‌ కాలనీకి చెందిన గంట నాగమణి, బి.గోవింద్‌ల ఇంటికి తీసుకెళ్లి రెండు రోజులు ఉంచాడు. ఆ తరువాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి శ్రీహరిపురంలో ఒక ఇల్లు తీసి అందులో ఉంచి అనైతిక సంబంధాన్ని కొనసాగిస్తూ వ్యభిచారం చేయించాడు. తనను పెళ్లి చేసుకోమని ఆమె ఒత్తిడి చేయడంతో ఆమెకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్లిపోయాడు. చివరకు అతడు నర్సీపట్నంలోని అమ్మిపేటలో ఉంటున్నట్టు తెలుసుకొని గంట నాగమణి, గోవింద్‌లతో కలిసి గత నెల 30న అక్కడికి వెళ్లింది. చదవండి: ప్రియురాలితో కలిసి ఉండడం చూశాడని..

అక్కడకు చేరుకున్న తరువాత వారు ఈ యువతిని కొట్టి ఆమెను వదిలి వెళ్లిపోయారు. ఆ రోజు రాత్రికి నర్సీపట్నంలోని ఒక ఇంట్లో తలదాచుకున్న యువతి మరుసటి రోజు ఉదయం తన తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి తాను కాకినాడలో ఉన్నానని చెప్పి వారి వద్దకు వెళ్లిపోయింది. వారి సహకారంతో గాజువాక పోలీసుల వద్దకు వచ్చి ఆదివారం ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఉమామహేశ్వరి, కుమారి, నాగమణితోపాటు సతీష్‌ను, అతడికి సహకరించిన గోవింద్‌ను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.   

మరిన్ని వార్తలు