చెరబట్టబోయాడు.. చనిపోయింది!

29 Aug, 2019 10:52 IST|Sakshi

 మరదలపై కన్నేసిన బావ అత్యాచారం

తనను పెళ్లిచేసుకోవాలంటూ టార్చర్‌

ఆమె పెళ్లి సంబంధాలు చెడగొడుతూ హల్‌చల్‌

మనస్తాపంతో యువతి ఆత్మహత్య

 గాలిస్తున్న పోలీసులు

సాక్షి, ఒంగోలు: మాయ మాటలతో మరదలను లొంగదీసుకోవాలనునకున్న బావ వ్యవహారంతో మనస్తాపానికి గురైన బాధితురాలు బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానిక వేణుగోపాలస్వామి ఆలయం వీధిలోని కుమ్మరిపాలెంలో చోటుచేసుకుంది. 1972లో కర్ణాటకలో తుఫాన్లు వచ్చిన సమయంలో దాదాపు 30 కుటుంబాల వారు ఒంగోలుకు వచ్చి స్థిరపడ్డారు. వారిలో ఒకరైన నాగేంద్రం.. కుమ్మరిపాలెంలో నివాసం ఉంటున్నాడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. నాగేంద్రం పబ్లిక్‌ హెల్త్‌లో చిరుద్యోగిగా పనిచేస్తున్నాడు.

దశాబ్ద కాలం క్రితం కొత్తపట్నం మండలం చింతలకు చెందిన పాటిబండ్ల సుధాకర్‌బాబు అనే వ్యక్తి  వీరి ఇంట్లోని ఒక భాగాన్ని అద్దెకు తీసుకున్నాడు. టీ ప్యాకింగ్‌ చేసుకుంటూ వ్యాపారం నిర్వహించుకుంటుండేవాడు. ఈ క్రమంలో ఇంటి యజమాని కుమార్తె మాధవితో ప్రేమ వ్యవహారం నడిపి కులం వేరు అయినా తాళికట్టాడు. వారికి ఇద్దరు పిల్లలు కలిగారు. సుధాకర్‌బాబు స్వతహాగానే ఆస్తిపరుడు. అయితే మాధవి పెద్ద చెల్లెలు అయిన మౌనికపై బావ కన్నుపడింది. ఆమె డిగ్రీ పూర్తిచేసి ప్రస్తుతం డీఎస్సీతోపాటు ఇతర పోటీ పరీక్షలకు ఇంటి వద్దనే ఉంటూ ప్రిపేరవుతోంది. ఆమెను మాయమాటలతో లొంగదీసుకోవాలని యత్నించాడు.

కుదరక పోవడంతో తనను పెళ్లి చేసుకోవాలంటూ నిత్యం వేధిస్తున్నాడు.  కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో అతనిని ఇంటినుంచి వెళ్ళిపోవాలని హెచ్చరించారు. నీ భార్యను నువ్వు తీసుకువెళ్లాలన్నారు. అయితే ఆ తర్వాత ఇతను ఇంటి సమీపంలో తచ్చాడుతూ మరదలిని తీవ్రంగా హెచ్చరించడమే కాకుండా ఆమెకు వస్తున్న పెళ్ళి సంబంధాలను చెడగొడుతున్నాడు. తననే పెళ్లిచేసుకోవాలని వేధిస్తుండడంతో మనస్తాపం చెందిన మౌనిక (24) ఇంట్లోనే తెల్లవారు జామున ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మౌనికను కిందకు దించి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే కొద్దిసేపటికే సుధాకర్‌బాబు కూడా అక్కడకు చేరుకున్నాడు. మౌనిక మరణించిందని తెలిసి.. కేసు గీసు అంటే అంతు చూస్తానంటూ హెచ్చరించి వెళ్ళిపోయాడు. 

పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన భార్య
చెల్లెలి మృతికి కారణమైన భర్త పాటిబండ్ల సుధాకర్‌ బాబుపై స్థానిక వన్‌టౌన్‌ పోలీసులకు ఆయన భార్య ఫిర్యాదు చేసింది. తన భర్త తన సోదరిపై లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా ఆమె మృతికి కారణమయ్యాడని తెలిపింది. వన్‌టౌన్‌ సీఐ భీమానాయక్‌ కేసు నమోదు చేసి మౌనిక మృతదేహానికి ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం ప్రక్రియ పూర్తిచేశారు. ఇంత జరిగినా నిందితుడు మాత్రం గత 20 రోజుల నుంచి అడ్రెస్‌ లేడని, అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొంటుండడం గమనార్హం.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా