కాల పరీక్షలో ఓడింది

22 Apr, 2019 13:47 IST|Sakshi
మృతురాలు గవిని హేమలత

రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి

పంచాయతీ కార్యదర్శి పరీక్షకు హాజరవుతుండగా ఘటన

భర్తకు స్వల్ప గాయాలు

బాపట్లటౌన్‌: పంచాయతీ కార్యదర్శి ఎంపిక పరీక్షకు హజరయ్యేందుకు మోటారు సైకిల్‌పై భర్తతో కలిసి ప్రయాణిస్తున్న యువతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన ఆదివారం మండలంలోని ఈతేరులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బాపట్ల పట్టణం 17వ వార్డు అక్బర్‌పేటకు చెందిన గవిని హేమలత పంచాయతీ కార్యదర్శి పరీక్ష రాసేందుకు గుంటూరు ఏసీ కళాశాల పరీక్ష కేంద్రానికి భర్త ఎర్రిబోయిన కుమార్‌తో కలిసి ద్విచక్రవాహనంపై బయల్దేరింది. ఈతేరు సమీపంలో ఆర్టీసీ బస్సును ఓవర్‌టెక్‌ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న టీవీఎస్‌ మోపెడ్‌ ఢీకొనడంతో రోడ్డుపై పడిన హేమలత తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు.

ఆమె భర్త కుమార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. టీవీఎస్‌ మోపెడ్‌పై ప్రయాణిస్తున్న పొన్నూరు మండలం ములుకుదురు గ్రామానికి చెందిన ఉసిరికాయ కృష్ణ, భార్య రోడ్డుమార్జిన్‌లో పడ్డారు. వీరికి స్పల్ప గాయాలయ్యాయి. ఎంఏ బీఈడీ పట్టభద్రులైన హేమలత పట్టణంలోని సాల్వేషన్‌ ఆర్మీ విలియం బూత్‌ జూనియర్‌ కళాశాలలో ఐదేళ్లపాటు అర్థశాస్త్రం అధ్యాపకురాలిగా పని చేశారు. పొన్నూరు మండలం కసుకుర్రు గ్రామానికి చెందిన ఎర్రిపోయిన కుమార్‌తో 2017లో ఆమెకు వివాహమైంది. కుమార్‌ బాపట్ల సమీపంలోని నాగేంద్రపురం ఫేస్‌ ఇనిస్టిట్యూట్‌లో మాస్టర్‌ ట్రైనర్‌గా పని చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం పొన్నూరు మండలంలోని కసుకర్రు గ్రామానికి తరలించారు. ఈ మేరకు తాలుకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు