ఉద్యోగం పేరుతో వల

28 May, 2020 08:05 IST|Sakshi

వ్యభిచార రొంపిలోకి దింపే యత్నం

తెలివిగా తప్పించుకున్న యువతి

లాక్‌డౌన్‌ నేపథ్యంలో నెల రోజులుగా అవస్థలు

పోలీసుల చొరవతో ఎట్టకేలకు స్వస్థలానికి

అనంతపురం క్రైం: ఉద్యోగం పేరుతో అమాయకురాలిని వ్యభిచార రొంపిలోకి దింపేందుకు ప్రయత్నించిన మహిళపై అనంతపురం త్రీటౌన్‌ పోలీసులు నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదు చేశారు. సీఐ రెడ్డప్ప తెలిపిన వివరాలివీ.. అనంతపురం రూరల్‌ పరిధిలోని ఒక ప్రాంతంలో రెండు నెలల కిందట పద్మావతి అలియాస్‌ దస్తగిరమ్మ అనే మహిళ నివాసముంటోంది. తన ఇంటి సమీపంలో ఉంటున్న ఓ అమ్మాయి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తుండటం గమనించింది.

తనకు ప్రొద్దుటూరులో తెలిసిన వారున్నారని, అక్కడికొస్తే ఉద్యోగం ఇప్పిస్తానని, భవిష్యత్తు బాగుంటుందని తెలపడంతో ఆ అమ్మాయి నమ్మింది. ఇంట్లోఎవరికీ చెప్పకుండా పద్మావతి వెంట ప్రొద్దుటూరుకు వెళ్లింది. విషయం తెలియకపోవడంతో అమ్మాయి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రొద్దుటూరులో ఉద్యోగం చూపిస్తానని తీసుకెళ్లిన పద్మావతి వ్యభిచార వృత్తి చేసుకుంటే కావలసినంత సంపాదన వస్తుందని అమ్మాయికి ఆశ చూపింది. తాను అలాంటి పని చేయనని చెప్పినా ఎలాగైనా ఆ రొంపిలోకి దించేందుకు శతవిధాలా ప్రయత్నించింది. ఎలాగోలా ఆమె నుంచి అమ్మాయి తప్పించుకుంది. అప్పటికే లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో ప్రొద్దుటూరులోనే ఇరుక్కుపోయింది. అమ్మాయి ఆచూకీ తెలుసుకున్న త్రీటౌన్‌ సీఐ రెడ్డప్ప తన బృందంతో వెళ్లి అనంతపురం తీసుకొచ్చారు. పద్మావతిపై ఉమెన్‌ ట్రాఫికింగ్‌ (అమ్మాయిల తరలింపు) కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు