తెలంగాణ యువతి కిడ్నాప్‌ కేసు ఛేదన

27 Mar, 2019 11:53 IST|Sakshi
ధనలక్ష్మిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

సీసీ రికార్డు పుటేజీ ‘క్లూ’తో నిందితుడిని పట్టుకున్న పోలీసులు

వివాహం చేసుకునేందుకు యువతిని చెన్నైకు తీసుకెళ్లిన కిడ్నాపర్‌

మతిస్థిమితం లేదని గుర్తించి ఎగ్మూర్‌ స్టేషన్‌లో వదిలేశాడు

యువతిని హోమ్‌లో చేర్పించిన తమిళనాడు రైల్వే పోలీసులు

ఎట్టకేలకు తల్లిదండ్రులకు అప్పగింత

తిరుమల : మతిస్థిమితంలేని యువతి అదృశ్యం కేసును తిరుమల పోలీసులు ఛేదించారు. తిరుమల ఏఎస్పీ మహేశ్వరరాజు కథనం..తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కొత్తగూడెం గాంధీనగర్‌కు చెందిన కె.ధనలక్ష్మి(23) కుటుంబ సభ్యులతో ఈనెల 9న తిరుమలకు వచ్చారు. అయితే  పీఏసీ–1లో నిద్రిస్తుండగా ఆమె వేకువజామున 1.37 గంటలకు అదృశ్యమైంది. ఇది గుర్తించిన ఆమె సోదరుడు దుర్గాప్రసాద్‌ ఉదయం టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ సోదరికి మతిస్థిమితం లేదని ఎవరైనా తీసుకుపోతే వారి వెంటే వెళుతుందని, భోజనం పెడితే తింటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు పీఏసీ–1 సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. 

ధనలక్ష్మిని నిద్ర లేపి చేయి పట్టుకుని ఓ వ్యక్తి తీసుకెళ్లడం, అక్కడ నుంచి కమాండర్‌ జీపులో తీరుపతికి తీసుకెళ్లే దృశ్యాలు రికార్డు అయి ఉండటంతో క్లూ లభించినట్లైంది.  తిరుపతి రైల్వే స్టేషన్‌లోని సీసీ టీవీ రికార్డులను పరిశీలిస్తే వేకువజామున 2.43 గంటలకు రైలు ఎక్కి చెన్నైకు వెళ్లినట్లు గుర్తించారు. నిందితుడు తిరుమలకు వచ్చినప్పుడు అతను తన వెంట తెచ్చిన బ్యాగు తిరుగు ప్రయాణంలో లేకపోవడాన్ని గమనించారు. పీఏసీ–1 లో ఆ బ్యాగ్‌ను అతను వదిలిపెట్టి వెళ్లడంతో నిందితుడి వివరాలు ఇట్టే తెలుసుకోగలిగారు. ఓ కంపెనీలో అతను పనిచేస్తున్నట్టు గుర్తింపు కార్డు, ఆధార్‌ కార్డులు పోలీసులకు లభ్యమయ్యాయి. ఆ కంపెనీ యాజమాన్యాన్ని పోలీసులు సంప్రదించి మరిన్ని వివరాలు సేకరించారు. అతని పేరు అర్జున్‌ దాస్‌ అని తెలుసుకున్నారు. అంతేకాకుండా కాల్‌ డేటా అతను చెన్నైలోనే ఉన్నట్లు గుర్తించి, ఎట్టకేలకు అతడిని అరెస్ట్‌ చేశారు. ధనలక్ష్మిని పెళ్లి చేసుకునేందుకు తీసుకెళ్లి, ఆమెకు మతిస్థిమితం లేదని గ్రహించాక అర్జున్‌దాస్‌ ఆమెను చెన్నై ఎగ్మూర్‌ స్టేషన్‌లో విడిచి పెట్టినట్లు విచారణలో తేలింది. రైల్వే పోలీసులు ఆమెను ఒక హోమ్‌లో చేర్చినట్లు తెలుసుకున్నారు. ఆ హోమ్‌ నుంచి ధనలక్ష్మిని తీసుకొచ్చిన పోలీసులు సోమవారం సాయంత్రం ఆమె తల్లిదండ్రులకు అప్పటించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి  రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు