భర్త ఇంటి ఎదుట యువతి మౌనదీక్ష

19 Feb, 2018 06:31 IST|Sakshi
భర్త ఇంటి ముందు మౌన దీక్ష చేస్తున్న హమీదా (సాయి)

ప్రకాశం, చీరాల రూరల్‌: వెంట పడ్డాడు.. ఆమెకు మాయ మాటలు చెప్పాడు.. ప్రేమించానన్నాడు.. చివరకు పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలం ఆమెతో కాపురం చేశాడు. తీరా తల్లిదండ్రుల మాటలు విని ఇద్దరు బిడ్డలు కలిగిన అనంతరం ఆమెను వదిలేశాడు. పోలీసులైనా న్యాయం చేస్తారని స్టేషన్‌ మెట్లెక్కినా న్యాయం జరగలేదు. దీంతో ఆ అభాగ్యురాలు చేసేదేమీలేక దిక్కు తోచని స్థితిలో ఇద్దరు పిల్లలతో సహా భర్త ఇంటి ఎదుట మౌన పోరాటానికి దిగింది. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం చీరాలలోని వైకుంఠపురంలో వెలుగుచూసింది.

ఇదీ..జరిగింది
వేటపాలేనికి చెందిన సయ్యద్‌ హమీద, చీరాలకు చెందిన గండి సాయి నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. సాయి ఆటో డ్రైవర్‌. ఇద్దరు పాపరాజు తోటలోని పోలేరమ్మ గుడి సమీపంలో అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. కొంత కాలం కాపురం సక్రమంగానే సాగింది. ఈ క్రమంలో గతేడాది జూన్‌ 19న ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. కొంత కాలానికి అనారోగ్యానికి గురై బిడ్డ చనిపోయాడు. ప్రస్తుతం ఆమె రెండో నెల గర్భిణి.
ఈ నెల 6వ తేదీ నుంచి భర్త ఇంటికి రాకపోవడంతో ఆమె ఆందోళన చెందింది. భర్త సాయి తల్లిదండ్రులు వైకుంఠపురంలోని మహాలక్ష్మమ్మ చెట్టు సమీపంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారని తెలుసుకున్న ఆమె.. వారి ఇంటికి వెళ్లి పరిశీలించింది. వారంతా అక్కడి నుంచి తమ స్వగ్రామం ఒంగోలు వెళ్లినట్లు ఆమెకు సమాచారం అందింది.

ప్రస్తుతం ఆ ఇంట్లో సాయి అమ్మమ్మ మాత్రమే ఉంటోంది. ఏం చేయాలో పాలుపోని ఆమె ఒన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. నీకు వివాహమైనట్లు ఆధారాలు చూపించాలని అక్కడ విధులు నిర్వర్తించే పోలీసులు ఆమె వద్ద ఫిర్యాదు స్వీకరించలేదు. పైపెచ్చు నీ భర్త తల్లిదండ్రులు నీమీద కేసు పెట్టే అవకాశం ఉందని పోలీసులు చెప్పడంతో భయాందోళన చెందిన ఆమె.. స్టేషన్‌ నుంచి వెనుదిరిగింది. చేసేదేమిలేక ఆమె తన భర్త ఇంటి ముందు మౌన దీక్షకు దిగింది.

గతంలోనే ఆమెకు వివాహమైంది..
హమీదాకు గతంలో రియాజ్‌ అనే వ్యక్తితో వివాహమైంది. వారికి ఐదేళ్ల కరిష్మా, నాలుగేళ్ల నవాజ్‌ ఉన్నారు. దంపతుల మధ్య సఖ్యత లేకపోవడంతో పెద్దలు సమక్షంలో తెగతెంపులు చేసుకుని ఎవరికి వారు విడివిడిగా ఉంటున్నారు. పిల్లలు మాత్రం హమీద వద్దే ఉంటున్నారు. ఆ తర్వాత గండి సాయితో పరిచయం ఏర్పడింది. నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. మొదటి భర్తకు చెందిన ఇద్దరు పిల్లలతో సహా పాపరాజు తోటలోని ఓ అద్దె గృహంలో ఉంటున్నారు. తన భర్తను అతని తల్లిదండ్రులే తీసుకెళ్లి దాచారని బాధితురాలు హమీదా కన్నీటి పర్యంతమైంది. తనకు న్యాయం చేయాలని, తన పిల్లలను హాస్టల్లో చేర్చించి చదివించాలని ప్రతి ఒక్కరినీ వేడుకొంటోంది. భర్త ఇంటి ముందు మౌన దీక్షకు దిగిందన్న సమాచారం అందుకున్న ఒన్‌టౌన్‌ పోలీసులు బాధితురాలి వద్దకు చేరుకుని ఆమె వివరాలు సేకరిస్తున్నారు.

మరిన్ని వార్తలు