అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

7 Feb, 2019 13:16 IST|Sakshi
మేడికొండూరు పోలీసులను ఆశ్రయించిన మమత అక్క నమితా సేత్, తండ్రి బసంత్‌.. (ఇన్‌సెట్‌) మమతాసేత్‌

ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

మూడు వారాల కిందటే మృతదేహం ఖననం

మేడికొండూరు పోలీసులను ఆశ్రయించిన యువతి కుటుంబసభ్యులు

గుంటూరు, పేరేచర్ల(తాడికొండ): అనుమానాస్పద స్థితిలో యువతి మృతి చెందిన సంఘటన 22 రోజుల తరువాత ఆలస్యంగా వెలుగు చూసింది. మండల కేంద్రమైన మేడికొండూరులో ఈ ఉదంతం జరిగింది. యువతి సోదరి, తండ్రి ఒడిశా నుంచి వచ్చి తమ కుమార్తె చనిపోయిందంటున్నారని, దర్యాప్తు చేసి న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదుచేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి.

ఒడిశా రాష్ట్రం భద్రక్‌ జిల్లా అచోం గ్రామానికి చెందిన మమతాసేత్‌ ఆమె సోదరి నమితాసేత్, తండ్రి బసంత్‌కుమార్‌ను మేడికొండూరు మండల పరిథిలోని భీమనేనివారిపాలెం సమీపంలోని ఒక స్పిన్నింగ్‌ మిల్లులో అదే రాష్ట్రానికి చెందిన గుత్తేదారు దిబాకర్‌ పనికి కుదిర్చాడు. మూడు సంవత్సరాల క్రితం నమితాకు వివాహం నిశ్చయమవటంతో వారు ముగ్గురూ ఒడిశాకు వెళ్లి పోయారు. అనంతరం మమతాసేత్‌ మాత్రం మళ్లీ మిల్లులో పనికి తిరిగి వచ్చింది. మొదటి నుంచి ఆమెతో చనువుగా ఉంటున్న దిబాకర్‌ మమతను తాను సొంతంగా పెట్టిన కిరాణా దుకాణంలో ఉంచి, ఇద్దరూ కలసి ఒకే గదిలో ఉండేవారు. దిబాకర్‌కు సామర్లకోటలో కూడా లేబర్‌ కాంట్రాక్టు ఉండటంతో అప్పుడప్పుడు అక్కడికి వెళ్లి వస్తుండేవాడు.

పోలీసుల విచారణలో వెలుగు చూసిన నిజాలు
మమతాసేత్‌ జనవరి 15న అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. మమత అక్క, తండ్రి ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మేడికొండూరు ఎస్‌ఐ సీహెచ్‌ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది మిల్లు దగ్గరకి వెళ్లి సహచర కూలీలు, మమత ఉండే గది పక్కన ఉన్న  గుత్తేదారు దిబాకర్‌ తమ్ముడిని విచారించారు. విచారణలో  దిబాకర్‌ తమ్ముడు  మాట్లాడుతూ జనవరి 15 రాత్రి మమత ఎంత సేపటికి గదిలో నుంచి బయటికి రాక పోయేసరికి తాళాలు పగలకొట్టి చూశానని మమత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొందని తెలిపాడు. ఏంచేయాలో తెలియక తాను సామర్లకోటలో ఉన్న తన అన్న దిబాకర్‌కు ఫోన్‌లో సమాచారం అందించగా, మరో ఇద్దరితో కలసి దగ్గరలో ఉన్న శ్మశానవాటికలో ఖననం చేయమని చెప్పడంతో అలాగే చేశామని పోలీసులకు వివరించాడు. తాను చనిపోతున్నానని మమత  దిబాకర్‌ ఫోన్‌కు మెసేజ్‌ కూడా పంపించిందని తెలపటంతో పోలీసులు దిబాకర్‌ కోసం వెతుకుతున్నారు. మమతా సేత్‌ను ఖననం చేసిన ప్రదేశాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు.

మరిన్ని వార్తలు