పది రోజుల్లో పెళ్లి.. యువకుడి ఆత్మహత్య

24 Feb, 2020 04:12 IST|Sakshi
యోగేశ్‌ (ఫైల్‌)

సవతి తల్లితో వివాదమే కారణం!

చిత్తూరు జిల్లాలో ఘటన

పలమనేరు: మరో పదిరోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన ఆ యువకుడు విషపు గుళికలు తిని ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి సరుకులు తీసుకొస్తానని బుధవారం వెళ్లిన ఆ యువకుడు యోగేశ్‌ ఆదివారం అటవీ ప్రాంతంలో శవమై కనిపించడం చిత్తూరు జిల్లా పలమనేరు మండలం టి.వడ్డూరులో విషాదం నింపింది. గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ వేమన్నకు అశోక్, యోగేశ్‌ కుమారులు. పదేళ్ల కిందట అశోక్‌ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీన్ని తట్టుకోలేని అతడి తల్లి రాజమ్మ కూడా అదేరోజు పురుగుమందు తాగి ప్రాణాలు తీసుకుంది. తరువాత వేమన్న రెండో వివాహం చేసుకున్నారు. అన్న, తల్లి మృతితో మానసికంగా ఇబ్బందిపడిన యోగేశ్‌.. తరువాత బెంగుళూరు వెళ్లి ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇటీవల అతడికి వి.కోట మండలం తోటకనుమ గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది.

ఇంటికి వచ్చి పెళ్లిపనుల్లో నిమగ్నమైన యోగేశ్‌కు, అతడి సవతితల్లికి ఇంటి పెయింటింగ్‌ విషయమై గత బుధవారం వివాదం జరిగింది. దీంతో తీవ్రంగా కలత చెందిన అతడు అదేరోజు తన తండ్రితో బెంగళూరులో పని ఉందని చెప్పి కొత్తగా కొన్న బుల్లెట్‌ మీద వెళ్లాడు. గ్రామానికి సమీపంలోని కొత్త చెరువు వద్ద నల్లక్కబాయి అటవీ ప్రాంతంలో బుల్లెట్‌ను, విషపుగుళికలను ఆదివారం గుర్తించిన పెంగరగుంట వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి వచ్చిన పోలీసులు పరిశీలించి సమీపంలో యోగేశ్‌ మృతదేహాన్ని గుర్తించారు. అతడు నాలుగు రోజుల కిందటే ప్రాణాలు తీసుకున్నట్లు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు