మత్తులో యువత

7 May, 2019 09:05 IST|Sakshi
యువకులను అరెస్టు చేస్తున్న పోలీసులు

రాత్రంతా రిసార్ట్‌లో హంగామా పోలీసుల దాడులు

150 మందికి పైగా అరెస్టు

పోలీసు స్టేషన్‌కు ఏడు మంది యువతులు

ఐదు మంది నిర్వాహకులపై కేసులు

సాక్షి, చెన్నై: ఈసీఆర్‌ మార్గంలో ఓ రిసార్ట్‌లో మత్తులో యువత తూలారు. అర్ధరాత్రి వీరు సృష్టించిన హంగమా ఏకంగా నేర విభాగం ప్రత్యేక డీజీపీ దృష్టికి చేరింది. తిరువళ్లూరు ఎస్పీ, ఇద్దరు డీఎస్పీల నేతృత్వంలోని రెండు వందల మంది పోలీసులు ఆ రిసార్ట్‌ను చుట్టుముట్టారు. మత్తుకు చిత్తై ఉన్న 150 మందికి పైగా యువకులు, యువతులు, బౌనర్లను అరెస్టు చేశారు. ఐదు మంది నిర్వాహకుల మీద కేసు నమోదు చేశారు.

ఇటీవల కాలంగా రిసార్టుల్లో వీకెండ్‌ పార్టీలు జోరుగా సాగుతున్నాయి. మత్తులో యువత తూలే దిశగా మద్యం, గంజాయి, మాత్రలు వంటి వాటిని సరఫరా చేసే వాళ్లు పెరగడంతో వీటికి ఆకర్షితులయ్యే వారి సంఖ్య పెరుగుతోంది. గత వారం పొల్లాచ్చిలోని ఓ రిసార్ట్‌లో సాగిన వీరంగంతో పోలీసులు కొరడా ఝుళిపించారు. అక్కడ పట్టుబడ్డ యువతను హెచ్చరించి పంపించారు. నిర్వాహకుల మీద మాత్రం కేసులు పెట్టారు. అరెస్టులు చేశారు. అయినా, తాము తగ్గేది లేదన్నట్టుగా రిసార్టులు, యువ సమూహం మత్తుకు చిత్తయ్యే పనిలో పడ్డాయి. ఆదివారం అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో మహాబలిపురం సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు రిసార్ట్‌లో సాగుతున్న హంగమా నేర విభాగం ప్రత్యేక డీజీపీ విజయకుమార్‌ దృష్టికి చేరింది. ఆయనకు వచ్చిన ఫిర్యాదుతో కాంచీపురం పోలీసుల్ని అప్రమత్తం చేశారు. ఆ జిల్లా ఎస్పీ సంతోష్‌ సెలవులో ఉండటంతో తిరువళ్లురు ఎస్పీ పొన్నిని రంగంలోకి దించారు.

ఫేస్‌బుక్‌తో ఏకం.. విందుతో మజా
తిరువళ్లురు ఎస్పీ పొన్ని నేతృత్వంలోని డీఎస్పీ సుబ్బరాజు, ఏడీఎస్పీ శిలంబరసన్‌తో పాటుగా రెండు వందల మంది పోలీసులు ఆ రిసార్ట్‌ను అర్ధరాత్రి వేళ చుట్టుముట్టారు. ఎవ్వరూ లేనికి వెళ్లలేనంతగా అక్కడ నిర్వాహకులు భద్రతా ఏర్పాట్లు చేసుకుని ఉండటంతో కాసేపు బయటే వేచి ఉండాల్సిన పరిస్థితి. అక్కడ యాబైకు పైగా ఖరీదైన కార్లు ఉండటంతో వాటిలో తనిఖీలు చేపట్టారు. ఎట్టకేలకు పోలీసులు అతి కష్టం మీద లోనికి వెళ్లారు. ఈ సమయంలో పోలీసులతో అక్కడ మత్తుకు చిత్తైన వాళ్లు తిరగబడే యత్నం చేశారు. కొందరు అయితే, అక్కడ హోరెత్తుతున్న సంగీతంతో పోలీసుల్ని సైతం పట్టించుకోకుండా నృత్యాలు చేస్తుండటం గమనార్హం. దీంతో అక్కడున్న స్పీకర్లను పోలీసులు తొలగించారు. దీంతో ఆగ్రహించిన అక్కడున్న వాళ్లు తిరగబడే రీతిలో వ్యవహరించడంతో పోలీసులు తమదైన శైలిలో రుచి చూపించే యత్నం చేశారు.

దీంతో అక్కడున్న అనేక మంది భయంతో బయటకు పరుగులు పెట్టే యత్నం చేసినా, ముందుగానే పోలీసులు అన్ని దార్లను మూసివేయడంతో శరణు కోరక తప్పలేదు. తామంతే ఫేస్‌బుక్, ట్విటర్ల ద్వారా ఏకం అయ్యామని, తరచూ ఇక్కడకు వచ్చి విందు, వినోదాలతో గడుపుతామని పోలీసులకు వారు వివరణ ఇచ్చుకున్నారు. అయితే, ఆ పరిసర వాసులకు ఇబ్బంది కల్గించే రీతిలో స్పీకర్లు ఏర్పాటు చేయడంతో పాటుగా అక్కడ పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లే కాదు, పది గ్రామలు, ముప్పై గ్రాములు చొప్పున గంజాయి ప్యాకెట్లు లభించడం, అనేక రకాల మాత్రలు సైతం ఉండటంతో అందర్నీ అదుపులోకి తీసుకున్నారు. వేకువజామున వీరందర్నీ సమీపంలోని ఓ కల్యాణ మండపంలో ఉంచి విచారించారు. అందరి వద్ద తలా రూ.మూడు వేలు చొప్పున వసూళ్లు చేసిన నిర్వాహకులు ఐదు మంది మీద కేసు నమోదు చేశారు. మిగిలిన వారికి తీవ్ర హెచ్చరికలు చేసి పంపించేందుకు నిర్ణయించారు.

తల్లిదండ్రులకు చీవాట్లు..
మొత్తంగా 150 మంది యువకులు, ఏడుగురు యువతులు, పది మంది బౌనర్లు, ఐదు మంది నిర్వాహకులు అక్కడ పట్టుబడ్డారు. యువతుల్ని మాత్రం మహిళ పోలీసు స్టేషన్‌కు తరలించి, వారి వివరాలను సేకరించారు. మత్తుకు చిత్తై ఉన్న ఆ యువతుల తల్లిదండ్రుల్ని పిలిపించి తీవ్రంగా మందలించారు. ఏదేని జరగరానిది జరిగిన పక్షంలో పోలీసుల్ని నిందిస్తారంటూ తల్లిదండ్రులకు చీవాట్లు పెట్టారు.

మరిన్ని వార్తలు