పబ్‌ వ్యవహారాలకు పగ్గాలు లేవా?

10 Mar, 2020 09:10 IST|Sakshi

బంజారాహిల్స్‌: తెల్లవారుజాము వరకు మందుబాబులు పబ్‌లను వదిలి బయటకు రావడం లేదు.  గొడవలు లేకుండా లేనిరోజులేదు. దీంతో పోలీసులకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. జూబ్లీహిల్స్‌తో పాటు పలు సంపన్న ప్రాంతాల్లో పబ్‌లలో రాత్రి ఒంటిగంటదాటిందంటే లోపల, బయట గొడవల్లేని రోజంటూ ఉండటం లేదు. తాజాగా శని, ఆదివారాల్లో జూబ్లీహిల్స్‌లోని రెండు పబ్‌లలో గొడవలు శృతి మించి రాగాన పడ్డాయి. నెల క్రితం రోడ్‌ నెం 36లోని ఎయిర్‌ లైవ్‌ పబ్‌లో అయిదుగురు యువకులు పీకలదాకా మద్యం సేవించి సమీపంలోని ఓ వైన్‌షాప్‌కు వెళ్ళి వైన్‌బాటిల్‌ తస్కరిస్తూ పట్టుబడి గొడవకు దిగాడు. నిన్నగాక మొన్న ప్రిజమ్‌ పబ్‌లో రాహుల్‌ సిప్లిగంజ్‌ గొడవ పలు విమర్శలకు దారి తీసింది. నెల క్రితం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 45లోని ఓ పబ్‌కు ఉన్నతాధికారి వెళ్ళి మద్యం మత్తులో గొడవకు దిగాడు. అదే రాత్రి ఆ పబ్‌ సర్వర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా పట్టించుకోలేదు.

తాజాగా మూడు రోజులక్రితం కూడా మరో ఉన్నతాధికారి అదే పబ్‌లో సిబ్బందితో గొడవపడ్డాడు. ఆ కేసు కూడా పోలీసులుదాకా రాకుండానే మూతపడింది. మూడు నెలల క్రితం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 45 ఓ పబ్‌లో యువ హీరో మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. జూబ్లీహిల్స్‌రోడ్‌ నెం. 36లోని రెండు పబ్‌లలో నిత్యం గొడవలు జరుగుతూనే ఉంటాయి. అర్ధరాత్రి ఒంటింగంట దాటిందంటే అమ్మాయిలు బయటికి రాగానే అబ్బాయిలు మత్తులో చెలరేగిపోతుంటారు. పోలీసులుదాకా కొన్ని కేసులు వస్తుంటే మరికొన్ని అక్కడిక్కడే పరిష్కారం అవుతుంటాయి. దీనికి తోడు బౌన్సర్ల దాడులు పెరిగిపోతున్నాయి. మత్తులో యువతీ, యువకులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నప్పుడు వారిని నియంత్రించే క్రమంలో బౌన్సర్లు చేస్తున్న అరాచకాలు పలు విమర్శలకు దారి తీస్తున్నాయి. ఇటీవల జూబ్లీహిల్స్‌ పోలీసులు పది మంది బౌన్సర్లపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో గొడవలపై ఇప్పటికే పది కేసులు నమోదయ్యాయి.  

మద్యం మత్తులో యువతితో అసభ్య ప్రవర్తన..పబ్‌ వద్ద గొడవ  
బంజారాహిల్స్‌: పబ్‌లో పీకలదాకా మద్యం తాగిన ఓ యువకుడు బయటకు వచ్చిన తర్వాత అప్పుడే పబ్‌ నుంచి బయటకు వచ్చిన ఓ యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో నిందితుడిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పబ్‌ బయట జరిగిన ఈ గొడవ వివరాలు ఇలా ఉన్నాయి... జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 45లో ఉన్న హార్ట్‌కప్‌ పబ్‌లోకి శనివారం రాత్రి పాతబస్తీకి చెందిన ఫిరోజ్‌ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి వచ్చాడు. అంతా కలిసి మద్యం తాగారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఫిరోజ్‌ ఓ యువతిని   వేధించాడు. అయితే ఆమె పెద్దగా పట్టించుకోలేదు. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో  బయటకు వచ్చిన ఫిరోజ్‌ ఆమె కోసం బయటే వేచి ఉన్నాడు. సదరు యువతి రాగానే వెనక నుంచి వెళ్ళి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్‌ 354 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా