పెనమలూరులో నడిరోడ్డుపై విద్యార్థుల బీభత్సం

22 Feb, 2018 18:17 IST|Sakshi

పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే కర్రలు, రాళ్లతో దాడులు

నడిరోడ్డుపై భయానక వాతావరణం..

హడలిపోయిన స్థానికులు, ప్రేక్షక పాత్ర వహించిన పోలీసులు

సాక్షి, విజయవాడ : కృష్ణాజిల్లా పెనమలూరులో నడిరోడ్డుపై విద్యార్థులు గురువారం బీభత్సం సృష్టించారు. పెనమలూరు పోలీస్ స్టేషన్ ఎదురుగానే విద్యార్థులు రెండు వర్గాలుగా ఏర్పడి పరస్పరం దాడులకు దిగారు. నడిరోడ్డుపై కర్రలు, రాళ్ళతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఇద్దరు విద్యార్థుల తలలు పగిలాయి. రాళ్ళు రువ్వుతూ భయానక వాతావరణం సృష్టించడంతో పెనమలూరు పోలీస్ స్టేషన్ బయట వున్న సెంట్రీలు సైతం స్టేషన్ లోకి పరుగులు తీశారు. చుట్టూ పక్కల నివాసాల వారు భయంతో తలుపులు వేసుకుని ఇళ్ళలోనే వుండిపోయారు.ఈ మొత్తం వ్యవహారంను చిత్రీకరిస్తున్న మీడియా రెండు గ్యాంగ్లోని విద్యార్థులు  కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ మీడియా కెమేరా ద్వంసం కాగా, ఇద్దరు మీడియా ప్రతినిధులకు దెబ్బలు తగిలాయి. పోలీస్ స్టేషన్ ఎదురుగానే బీభత్సకాండ జరుగుతున్నా, స్టేషన్ నుంచి పోలీసులు బయటకు రాకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

పెనమలూరులోని ఓ ప్రైవేట్ హాస్టల్కు చెందిన విద్యార్థుల మధ్య విభేదాలే దాడికి కారణమని తెలుస్తోంది. ఓ విద్యార్థి హాస్టల్ నిర్వాహకులకు డబ్బులు బకాయి పడటంతో నిన్న(బుధవారం) సదరు విద్యార్థిని హాస్టల్ నిర్వాహకులు చితకబాదారు. బాధితుడు పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే నిందితుల పక్షాన జిల్లాకు చెందిన ఓ మంత్రి అండగా వుండటంతో పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేయలేదని బాధిత విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మరోవైపు రాజీ చేసుకోవాలంటూ సదరు విద్యార్థిపై పోలీసులు ఒత్తిడి తెచ్చారని చెబుతున్నారు. ఈ క్రమంలో బాధిత విద్యార్థికి అండగా కొందరు విద్యార్థులు పెనమలూరు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. మరోవైపు హాస్టల్ నిర్వాహకులకు మద్దతుగా మరికొందరు అక్కడకు రావడంతో ఇరువర్గాలు పోలీస్ స్టేషన్ సాక్షిగా పరస్పరం దాడి చేసుకున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు