తప్పతాగి నడిరోడ్డుపై హంగామా..

11 Feb, 2018 08:54 IST|Sakshi
పబ్‌ను మూసివేస్తున్న పోలీసులు

బంజారాహిల్స్‌: ఒక్కరు.. ఇద్దరు కాదు.. దాదాపు 160 మంది యువతీ యువకులు.. పీకలదాకా మద్యం తాగారు.. నడిరోడ్డుపై చిందులేశారు.. పోలీసులనూ లెక్కచేయలేదు.. ఆ... ఏం చేస్తారులే అన్నట్లు నిర్లక్ష్యంగా ప్రవర్తించారు.. పబ్‌లో అర్ధరాత్రి వరకుతప్ప తాగి  నడిరోడ్డుపై నానా హంగామా చేశారు..జూబ్లీహిల్స్‌పోలీసులు తెలిపిన మేరకు.. రోడ్‌ నెం. 45లో ప్యాట్‌ పిజియన్‌ పబ్‌ వద్దకు శుక్రవారం రాత్రి పోలీసులు 11.45 గంటలకు వచ్చారు. 12 గంటలకు పబ్‌ మూసి వేయాలని యత్నిస్తుండగా పీకలదాకా మద్యం తాగిన యువతీ, యువకులు పోలీసులను అడ్డుకున్నారు. పబ్‌లోపలి నుంచి బయటకు రావడానికి నిరాకరించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వెంటనే పబ్‌ను మూసివేయాలని పోలీసులు ఎంత చెప్పినా వినకుండా పబ్‌ లోపలే ఉండిపోయారు. 

దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అర్ధరాత్రి దాటినా పబ్‌ తెరిచి ఉండటం పట్ల పోలీసులు క్లాస్‌ తీసుకున్నారు. బయటకు వచ్చిన యువతీ, యువకులు తాగిన మత్తులో డ్యాన్స్‌లు చేస్తూ న్యూసెన్స్‌కు పాల్పడ్డారు. దీంతో రోడ్డంతా ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ఎవరూ కదలకుండా అక్కడే డ్యాన్స్‌లు చేస్తూ నానా హంగామా సృష్టించారు. క్యాబ్‌ల కోసం రోడ్డుపైన వేచి చూస్తున్నామంటూ యువతీ, యువకులు చెబుతున్నారని సీఐ తెలిపారు.   160 మంది యువతీ, యువకులు అర్ధరాత్రి రోడ్డుపై చిందులేస్తుండటంతో సీన్‌ చూసేందుకు వాహనదారులందరూ ఎక్కడికక్కడే నిలిచిపోయారు.  

నీ సంగతి చూస్తా...:ఎస్‌ఐని బెదిరించిన పబ్‌ యజమానిపై కేసు  
బంజారాహిల్స్‌:  నా సంగతి నీకు తెలియదు.. నా పబ్‌కు వచ్చి నన్నే మూసేయమని చెబుతావా..? మూడు నెలలు కాకముందే మీ మాజీ సీఐని ఎలా పంపిం చామో నిన్ను కూడా అలాగే పంపిస్తాం ఖబ డ్దార్‌ అంటూ ఓ పబ్‌ యజమాని నిర్ధేశించిన సమ యం ముగిసినా బంద్‌ చేయకపోవడంతో పోలీసులు రాగా వారితో అన్న హెచ్చరికలు ఇవి. జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం రాత్రి 12.10 గంటల సమయంలో పోలీసులు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 1లోని స్టోన్‌ వాటర్‌పబ్‌ ఇంకా తెరిచి ఉండటంతో పోలీసులు వెళ్లారు. పబ్‌ను మూసివేయాలని కానిస్టేబుల్‌ రాజు చెప్పినా వినకపోవడంతో నైట్‌డ్యూటీలో ఉన్న ఎస్‌ఐ సైదా అక్కడికి వెళ్లారు. సరిగ్గా అర్ధరాత్రి 12.16 గంటల సమయంలో ఎస్‌ఐ అక్కడికి వెళ్లి ఇంకా తెరిచి ఉన్న పబ్‌ను వీడియో తీస్తుండటంతో యజమాని సంతోష్‌ అక్కడికి వచ్చి దుర్భాషలాడాడు. విధులను అడ్డుకున్నాడు. ఎస్‌ఐతో పాటు కానిస్టేబుల్‌ను నెట్టేసేందుకు ప్రయత్నించాడు.  నా సంగతి నీకు తెలియదంటూ వేలు చూపిస్తూ హెచ్చరించాడు. మూడు నెలలు కాకముందే మీ మాజీ సీఐని ఎలా పంపించామో అలాగే నిన్నూ పంపిస్తామంటూ రంకలేశాడు. దీంతో ఎస్‌ఐ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పబ్‌ యజమాని సంతోష్‌పై ఐపీసీ సెక్షన్‌ 353 కింద కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు