సీబీఐ విచారణ జరిపించాల్సిందే

16 Mar, 2019 02:19 IST|Sakshi

వైఎస్‌ వివేకానందరెడ్డి దారుణహత్యపై ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ డిమాండ్‌

చంద్రబాబు ప్రభుత్వంలో న్యాయం జరగదు 

నిజాలు బయటకు రావాలంటే థర్డ్‌పార్టీ లేదా సీబీఐతో విచారణ జరపాలి 

హత్య చేసేది వాళ్లే.. సిట్‌ వేసేది వాళ్లే.. ఎలా న్యాయం జరుగుతుంది?  

ఎస్పీతో నేను మాట్లాడుతుండగా ఇంటెలిజెన్స్‌ డీజీ ఫోన్లు చేస్తూ ఉన్నారు 

చంద్రబాబు హయాంలోనే తాత రాజారెడ్డి, చిన్నాన్న వివేకాను హత్య చేశారు  

తలచుకుంటే మళ్లీ అసెంబ్లీకి రాలేవంటూ వైఎస్సార్‌ను బాబు బెదిరించారు   

ఆ మరుసటి రోజే నాన్న హెలికాప్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు  

నాపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నానికి పాల్పడ్డారు  

పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలని కోరుతున్నా..  

సాక్షి ప్రతినిధి కడప: తన చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ లేదా థర్డ్‌ పార్టీ విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో న్యాయం జరగదని అన్నారు. శుక్రవారం సాయంత్రం వైఎస్సార్‌ జిల్లా పులివెందులలోని భాకరాపురంలో వైఎస్‌ వివేకానందరెడ్డి భౌతిక కాయానికి జగన్‌ నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అరాచకాలు చేయించేది వాళ్లే(టీడీపీ పెద్దలు).. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) నియమించేదీ వాళ్లే.. ఇక ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. థర్డ్‌ పార్టీతోనైనా లేక సీబీఐతోనైనా విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని జగన్‌ స్పష్టం చేశారు.

 ఇది ఒక్కరు చేసిన పనికాదు  
‘‘35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ మృదు స్వభావిగా గుర్తింపు పొందిన చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డిని అతి కిరాతకంగా ఇంట్లో చొరబడి గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశారు. వయస్సు రీత్యా చూసినా, వ్యక్తిత్వపరంగా చూసినా ఆయనంత సౌమ్యుడు ఎవరూ లేరు. దర్యాప్తు దారుణంగా, అధ్వానంగా ఉంది. చనిపోతూ లెటర్‌ రాశారా? డ్రైవర్‌ పేరు చెప్పి లెటర్‌ను సృష్టించారా? తలమీద ఐదుసార్లు గొడ్డలితో నరికారు. చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్లి బాత్రూంలో పడేసి రక్తం కక్కుకుని చనిపోయినట్లు చిత్రీకరించారు. కానీ, బెడ్‌రూం నుంచి బాత్రూం వరకు ఎత్తుకెళ్లినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఇది ఒక్కరు చేసిన పని కాదు. కిందపడి స్పృహ తప్పి పడిపోయి చనిపోయారని చెబుతున్నప్పుడు లెటర్‌ ఎలా రాస్తారు? చంపిన వారే లెటర్‌ రాయించారా? డ్రైవర్‌పై నెపం నెట్టడం కోసం లెటర్‌ రాశారా?’’వైఎస్‌ జగన్‌ నిలదీశారు. 


  
నిజాలకు పాతర వేసేందుకు యత్నాలు  
‘‘సౌమ్యుడిగా పేరుపొందిన చిన్నాన్నను పొట్టన పెట్టుకున్నారు. ఎంత అన్యాయం. పైగా నాతో మాట్లాడుతుండగా.. ఎస్పీకి అనేకసార్లు ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు నుంచి ఫోన్‌కాల్స్‌ వస్తూనే ఉన్నాయి. విషయాన్ని వారికి చేరవేస్తున్నారు. నిజాలకు పాతర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సాక్ష్యాలను తారుమారు చేయాలని చూస్తున్నారు. ఇలా అయితే నిజాలు ఎలా వెలుగులోకి వస్తాయి? నిజాలు వెలుగులోకి రావాలి. ఎవరు హత్య చేశారో తేలాలి. అందుకే సీబీఐ విచారణ చేయాలి’’అని జగన్‌ డిమాండ్‌ చేశారు. 

చంద్రబాబు హయాంలోనే తాత, చిన్నాన్న హత్యలు  
‘‘రాష్ట్ర రాజకీయాల వైపు వెళ్లకుండా నాన్నను కడపకే పరిమితం చేయాలని తాతను(రాజారెడ్డి) చంపారు. మొదటగా తాతను టార్గెట్‌ చేసి హతమార్చిన తర్వాత వారే నాన్నను చంపారు. ఆ విషయంలో ఇప్పటికీ మాకు అనుమానం ఉంది. అప్పట్లో విచారణ చేపట్టింది జేడీ లక్ష్మీనారాయణ. తాను తలచుకుంటే అసెంబ్లీకి రాలేవు అని సెప్టెంబర్‌ 1న అసెంబ్లీలో వైఎస్‌ రాజశేఖరరెడ్డిని చంద్రబాబు చాలెంజ్‌ చేశారు. మీరు మళ్లీ అసెంబ్లీకి ఎలా వస్తారని బెదిరించారు. మర్నాడే(సెప్టెంబర్‌) 2న నాన్నను చంపారు.

తాత రాజారెడ్డిని చంపినప్పుడు చంద్రబాబే ముఖ్యమంత్రి. నాన్నను అసెంబ్లీలో బెదిరించింది చంద్రబాబే. నాపై దాడి జరిగినప్పుడు సీఎం చంద్రబాబే. చిన్నాన్న హత్య జరిగింది చంద్రబాబు హయాంలోనే. తర్వాత అత్యంత పకడ్బందీ భద్రత ఉండే ఎయిర్‌పోర్ట్‌లో నాపై దాడి చేశారు. విచారణ అధికారులు చంద్రబాబుకు రిపోర్ట్‌ చేసే పరిస్థితి నుంచి బయటకు రావాలి. అప్పుడే నిజాలు నిగ్గు తేలుతాయి. అప్పుడే విచారణ నిక్కచ్చిగా జరుగుతుంది. చిన్నాన్న హత్య నేపథ్యంలో పార్టీ శ్రేణులంతా పూర్తి సంయమనం పాటించాలని కోరుతున్నా’’అని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్వేగభరితంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వెంట వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి, తన సోదరి షర్మిలమ్మ తదితరులు ఉన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా