వైఎస్‌ వివేకా హత్య కేసు ఛేదనకు 12 బృందాలు

18 Mar, 2019 04:02 IST|Sakshi

కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నాం

లెటర్‌ను ఫోరెన్సిక్‌కు పంపించాం

ఇప్పటివరకు 20 మందిని విచారించాం

అనుమానితులపై నిఘా పెట్టాం... 

సాంకేతిక సాక్ష్యాలకోసం వెతుకుతున్నాం

కడప ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ వెల్లడి  

సాక్షి కడప/అర్బన్‌: దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును ఛేదించేందుకోసం 12 బృందాలు పనిచేస్తున్నాయని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ చెప్పారు. ఆదివారం రాత్రి డీపీఓలోని కాన్ఫరెన్స్‌ హాలులో ఆయన మీడియాతో మాట్లాడారు. వివేకానందరెడ్డి హత్య కేసును సీఐడీ అడిషనల్‌ డీజీ అమిత్‌గార్గ్‌ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు పర్యవేక్షిస్తున్నాయని, ఇందులో సిట్‌ ఆధ్వర్యంలో ఐదు బృందాలు పనిచేస్తుండగా, జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఏడు బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు. వివేకానందరెడ్డి ఈ నెల 15వ తేదీ రాత్రి 11.30 గంటలకు పులివెందులలోని తన స్వగృహానికి వచ్చారని, ఇంటికి రాగానే డ్రైవర్‌ను పంపించి నిద్రపోయారన్నారు. తెల్లవారేసరికి ఆయన హత్యకు గురయ్యారని, ఈ నేపథ్యంలో ఆయన నిద్రకు ఉపక్రమించినప్పటి నుంచి మరుసటిరోజు ఉదయం 5.30 గంటల్లోపు ఏం జరిగి ఉంటుందనే దానిపై పూర్తిస్థాయిలో విచారిస్తున్నామని చెప్పారు.

ఇప్పటికే సిట్‌ బృందం పలుమార్లు నేర స్థలాన్ని పరిశీలించిందని, వైఎస్‌ వివేకా కుటుంబసభ్యులతోపాటు సోదరులను కూడా విచారించినట్లు తెలిపారు. హత్య జరిగిన రోజు ఉదయాన్నే డాగ్‌స్క్వాడ్, క్లూస్‌ టీంలతో సమగ్రంగా విచారించి ఆధారాలు సేకరించామన్నారు. కేసును సిట్‌కు అప్పజెప్పడంతో అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇంతవరకు 20 మంది సాక్షులను విచారించామన్నారు. ఈ కేసులో ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో, ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ సేవల్నీ వినియోగించుకుంటున్నామని చెప్పారు. జిల్లావ్యాప్తంగా బృందాలతో రంగంలోకి దిగి ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అనుమానితులపై నిఘా ఉంచామని, జిల్లావ్యాప్తంగా సమాచార సేకరణ జరుగుతోందని తెలిపారు. అలాగే ఫోరెన్సిక్‌ సాంకేతిక సాక్ష్యాలకోసం బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు. లెటర్‌కు సంబంధించి శ్యాంపిల్‌ హ్యాండ్‌రైటింగ్‌ను కూడా పరిశీలించి ఫోరెన్సిక్‌కు పంపినట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు