నా భర్త హత్య కేసు దర్యాప్తును స్వతంత్ర సంస్థకు అప్పగించండి 

26 Mar, 2019 05:42 IST|Sakshi
సౌభాగ్యమ్మ

హైకోర్టులో వైఎస్‌ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ పిటిషన్‌ 

సాక్షి, అమరావతి: తన భర్త వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా సాగుతోందని వై.ఎస్‌.సౌభాగ్యమ్మ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తన భర్త హత్య కేసు దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ లేని స్వతంత్ర సంస్థ చేత చేయించాలని లేదా హైకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగించేలా ఆదేశాలివ్వాలని ఆమె తన పిటిషన్‌లో కోరారు. ఇందులో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కడప ఎస్‌పీ, ప్రత్యేక దర్యాప్తు బృందం అదనపు డీజీ, పులివెందుల ఎస్‌హెచ్‌వో, కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ సోమవారం విచారణకు రాగా, పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ, ఇదే అంశంపై పిల్‌ దాఖలైందని, అది మంగళవారం విచారణకు రానున్నదని, తమ వ్యాజ్యాన్ని ఆ పిల్‌కు జత చేయాలని కోర్టును కోరారు. ఇందుకు న్యాయమూర్తి జస్టిస్‌ విజయలక్ష్మి అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

పోస్టుమార్టం తరువాతే హత్య అని నిర్ధారించారు  
‘ఈ నెల 15న వేకువ జామున పులివెందుల ఇంటిలోని బాత్‌రూమ్‌లో నా భర్త మృతి చెంది ఉండటాన్ని పీఏ ఎం.వి.కృష్ణారెడ్డి గుర్తించారు. ఉదయాన్నే నిద్ర లేపేందుకు వెళ్లగా, ఎంత సేపటికీ తలుపు తియ్యకపోవడంతో కృష్ణారెడ్డి నాకు ఫోన్‌ చేశారు. రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చి ఉంటారు కాబోలు, లేపవద్దని కృష్ణారెడ్డికి చెప్పాను. దీంతో కృష్ణారెడ్డి కొద్ది సమయం తరువాత వెనుక వైపు తలుపు తెరిచి ఉండటాన్ని గమనించి అటుగా వెళ్లారు. వివేకా మంచంపై లేకపోవడంతో, బాత్రూం వరకు వెళ్లారు. అక్కడ వివేకా మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని కృష్ణారెడ్డి వెంటనే నాతో పాటు ఇతర కుటుంబీకులకు తెలియజేశారు. ఆ తరువాత అవినాశ్‌రెడ్డి తన పీఏ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. పోలీసులు వచ్చిన తరువాత మృతదేహాన్ని బాత్రూం నుంచి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. పోలీసులు మొదట సహజ మరణంగా భావించారు. పోస్టుమార్టం తరువాత హత్యగా నిర్ధారణకు వచ్చారు.’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

ఆ మంత్రిని ఇప్పటి వరకు ప్రశ్నించనే లేదు..  
పులివెందుల పోలీసులు దర్యాప్తు ప్రారంభించగానే, సీఎం చంద్రబాబు హడావుడిగా పత్రికా సమావేశం ఏర్పాటు చేసి, వివేకానందరెడ్డి హత్యపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత దర్యాప్తు సిట్‌కు బదిలీ అయింది. దర్యాప్తు సమయంలో అనుమానంపై పరమేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తిని సిట్‌ అదుపులోకి తీసుకుంది. ఈ పరమేశ్వర్‌రెడ్డి అధికార పార్టీ నేతలతో ముఖ్యంగా కడపకు చెందిన ఓ మంత్రితో నిత్యం మాట్లాడుతున్నట్లు మాకు తెలిసింది. అయితే సిట్‌ ఇప్పటి వరకు ఆ మంత్రిని ప్రశ్నించలేదు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తు్తన్నారు. పరమేశ్వర్‌రెడ్డి ఆరోగ్య వివరాలను కూడా తారుమారు చేసే పరిస్థితి ఉంది.’ అని సౌభాగ్యమ్మ ఆందోళన వ్యక్తం చేశారు.  

ముందస్తు నిర్ణయానికి వచ్చే ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు  
దర్యాప్తు ఎలా సాగాలో ఓ ముందస్తు నిర్ణయానికి వచ్చి ఆ దిశగా దర్యాప్తును సాగిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఈ దిశగా ఇప్పటికే ప్రకటనలు చేశారు. జిల్లా ఎస్‌పీ కూడా ఇలాంటి ప్రకటనే చేశారు. హత్య జరగడానికి 40 రోజుల ముందే ఆయన జిల్లా ఎస్‌పీగా నియమితులయ్యారు. నిష్పక్షపాత, స్వేచ్ఛాయుత దర్యాప్తు రాజ్యాంగ సూత్రాల్లో ఒకటి. ఈ దిశగా దర్యాప్తు జరపాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. పక్షపాతం, దురుద్దేశంతో ముందే నిర్ణయించుకున్న రీతిలో దర్యాప్తు సాగుతోంది. అందుకు ఆస్కారం లేకుండా దర్యాప్తు కొనసాగించాల్సి ఉంది. రాజకీయ జోక్యానికి ఆస్కారం ఇవ్వకూడదు. రాజకీయ రంగు పులుముకున్న దర్యాప్తు ప్రాథమిక హక్కులను హరించడమే అని సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో చెప్పింది.’ అని తెలిపారు.  

సిట్‌ దర్యాప్తులో రాజకీయ జోక్యం  
‘ఒకవేళ దర్యాప్తు పక్షపాతంగా జరుగుతుంటే, అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చునని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. హత్య కేసు  దర్యాప్తునకు ఏ ముగింపు ఇవ్వబోతున్నారో సీఎం, టీడీపీ నేతలు, పోలీసు పెద్దలు తమ ప్రకటనల ద్వారా చెప్పకనే చెప్పారు. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు కడపకు బదిలీపై వచ్చిన జిల్లా ఎస్పీ, సిట్‌లో భాగం కాకపోయినా, సిట్‌ దర్యాప్తును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నేరస్తులను చట్టం ముందు నిలబెట్టడానికి బదులు, వివేకా హత్య కేసును రాజకీయ ప్రయోజనాలకు, ప్రచారానికి వాడుకుంటున్నారు. సిట్‌ దర్యాప్తులో రాజకీయ జోక్యాన్ని నేతలు ఇచ్చిన ప్రకటనలే చెబుతున్నాయి. అని పేర్కొన్నారు. 

జగన్‌ పిటిషన్‌పై నేడు విచారణ  
ఇదిలా ఉంటే తన చిన్నాన్న వివేకానందరెడ్డి హత్యపై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ లేని స్వతంత్ర సంస్థ చేత దర్యాప్తు చేయించాలని కోరుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. 

మా కుటుంబంపై నిందలు మోపుతున్నారు  
వైఎస్‌ వివేకానందరెడ్డి కాకలు తీరిన రాజకీయ నాయకుడు. అటువంటి వ్యక్తి హఠాత్తుగా మరణించడం మాతో పాటు అతని అనుచరులను కలిచివేసింది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన సమయంలో వివేకానందరెడ్డి హత్య జరగడంతో దానిని కొందరు రాజకీయ నాయకులు రాజకీయం చేస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతుండగానే, ముఖ్యమంత్రితో సహా అధికార పార్టీ నేతలు వివేకానందరెడ్డి హత్య విషయంలో మా కుటుంబంపై నిందలు మోపుతూ మాట్లాడటం ప్రారంభించారు. దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.’ అని వివరించారు. 

అందుకే దర్యాప్తుపై అనుమానాలు  
ఎన్నికల వేళ ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండగా, కేవలం ఆపధర్మ ప్రభుత్వమే కొనసాగుతున్నప్పటికీ, పోలీసులు అధికార పార్టీ నేతలు చెప్పినట్లు చేస్తుండటం దర్యాప్తు తీరుపై అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న పోలీసుల వల్ల నిష్పాక్షిక దర్యాప్తు సాధ్యం కాదని అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నా భర్త హత్య కేసులో నిష్పాక్షికంగా దర్యాప్తు సాగేలా చూడాలని నా కుమార్తెతో కలిసి ప్రధాన ఎన్నికల అధికారికి వినతిపత్రం సమర్పించాను. పోలీసుల పక్షపాత దర్యాప్తు నేపథ్యంలో విధి లేని పరిస్థితుల్లో నేను ఈ పిటిషన్‌ను దాఖలు చేస్తున్నాను. నా పిటిషన్‌లో జోక్యం చేసుకుని నా భర్త హత్య కేసు దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో లేని స్వతంత్ర సంస్థ దర్యాప్తు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నా.’ అని సౌభాగ్యమ్మ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా