హత్యతో బ్రహ్మనాయుడికి సంబంధం లేదు

14 Aug, 2018 14:46 IST|Sakshi

వినుకొండ: గుంటూరు జిల్లా వినుకొండ మండలంలోని ఎ.కొత్తపాలెం గ్రామానికి చెందిన చల్లా  వెంకటకృష్ణ, గురజాల సోమయ్య, మేడబోయిన మల్లికార్జున్‌ అనే ముగ్గురు యువకులు వినుకొండ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. గ్రామంలో వివాదాల కారణంగా కారుతో ఢీకొట్టి ప్రమాదం సృష్టించారని ఆరోపణలు ఉత్పన్నమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జి బొల్లా బ్రహ్మనాయుడే ముగ్గురి మృతికి కారణమంటూ ఆరోపణలు చేశారు. దీనిని వైఎస్సార్‌సీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు ఖండించారు. రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

దీనిపై విచారణ చేపట్టిన వినుకొండ సీఐ శ్రీనివాస రావు మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి బొల్లా బ్రహ్మనాయుడుకి ఈ కేసుతో సంబంధం లేదని వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు నిందితుల్ని అరెస్ట్‌ చేశామని తెలిపారు.  తెలుగుదేశం పార్టీకి చెందిన గురజాల సోమయ్యకు, ఎనుగంటి రామకోటయ్యకు మధ్య ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి..పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని తెలిపారు. రోడ్డు ప్రమాదంగా సృష్టించాలని నిందితులు భావించారని పేర్కొన్నారు. గతంలో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారని, తాజాగా సిమెంటు రోడ్డు విషయంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని అన్నారు.

మరిన్ని వార్తలు