పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం: గౌతమ్ రెడ్డి

7 Feb, 2020 20:15 IST|Sakshi

న్యూ ఢిల్లీ: న్యూ ఢిల్లీలో అట్టహాసంగా జరుగుతున్న ఆటో ఎక్స్ పో -2020 మోటార్ షోలో భాగస్వామ్యమవడం చాలా సంతోషంగా ఉందని ఏపీ పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆటో ఎక్స్ లో ఏపీ పెవిలియన్ ను మంత్రి గౌతమ్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఆటో కాంపోనెంట్ షో 2020లో ఏపీలో తయారై, త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రోడ్లపై రయ్మని తిరగనున్న ఎలక్ట్రిక్ స్కూటర్ పనితీరును మంత్రి గౌతమ్ రెడ్డి ఆసక్తిగా పరిశీలించారు. ఏపీ రాష్ట్రం ఎలక్ట్రిక్ వాహనాలవైపు మళ్లడానికి సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు. 

పర్యావరణహిత విద్యుత్ వాహనాలే మానవ మనుగడకు శ్రేయస్కరమని మంత్రి స్పష్టం చేశారు. భారతదేశ వాహన సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వైపు మళ్లడం శుభపరిణామమని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా వరుస సమావేశాలతో గౌతమ్ రెడ్డి బిజీగా గడిపారు. ముందుగా ‘రెనాల్ట్ ఇండియా’ ఆటో మొబైల్ సీఈవోతో మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి సన్నాహాలు చేస్తున్నట్లు ఆ సంస్థ  సీఈవో మంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపట్టిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యమయ్యేందుకు రెనాల్ట్ ఇండియా సంస్థ ఆసక్తిగా ఉన్నట్లు వారు మంత్రికి తెలియజేశారు.

అనంతరం ‘గ్రేట్ వాల్ మార్ట్’ సంస్థకు చెందిన డైరెక్టర్లతో మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. ఏపీలో కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలనుకుంటే ఇక్కడ ఉన్న సానుకూల వాతావరణం, ప్రభుత్వ సహకారం ఎలా ఉంటుందో మంత్రి వారికి వివరించారు. ఆ తర్వాత మహీంద్ర ఆటో మొబైల్స్ సంస్థ ప్రతినిధులతో మంత్రి మేకపాటి సమావేశమయ్యారు. వ్యవసాయంలో కీలకంగా మారిన ట్రాక్టర్ల తయారీలో సంస్థ సరికొత్త ఆలోచనలను మంత్రి అభినందించారు. వ్యవసాయ పరిశ్రమలకు ఊతమిచ్చే అగ్రి ఆటోమొబైల్స్ విషయంలో సంస్థ ఆలోచనలు బాగున్నాయని మంత్రి గౌతమ్ రెడ్డి ప్రశంసించారు. భారత దిగ్గజ ఆటో ఇండస్ట్రీలలో ఒకటైన టాటా మోటార్స్ సంస్థ ప్రతినిధులు మంత్రి గౌతమ్ రెడ్డితో భేటీ అయ్యారు. 

భవిష్యత్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఆంధ్రప్రదేశ్నే ఎంచుకుంటామని సంస్థ ప్రతినిధులు మంత్రితో అన్నారు. ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు ఉంటాయని గౌతమ్ రెడ్డి హామీ ఇచ్చారు.  అనంతరం  నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తో గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి అందించే నిధులపై మంత్రి చర్చించారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన నిధుల కేటాయింపు గురించి మంత్రి విజ్ఞప్తి చేశారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, విశాఖపట్నం - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి ఆర్థికంగా సహకారంపై నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు. ఈ సమావేశాలలో పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జె.సుబ్రహ్మణ్యం, సలహాదారు శ్రీధర్ లంక, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు