పోలవరం బకాయిలను విడుదల చేయాలి

11 Dec, 2019 18:01 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును వెంటనే చెల్లించాలని కేంద్ర ఆర్థిక మంత్రి  నిర్మలా సీతారామన్‌కు వైఎస్సార్ సీపీ పార్లమెంట్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి, లోక్‌సభ పక్ష నేత మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీకి చెందిన ఎంపీలు బుధవారం నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన అనేక పద్దుల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. అలాగే ఎంపీలందరూ సంతకాలు చేసిన విజ్ఞాపన పత్రాన్ని ఆర్థిక మంత్రికి సమర్పించారు. 

‘పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 5,103 కోట్లు రుణం తీసుకొని ఖర్చు చేసింది. ఖర్చు చేసిన మొత్తాన్ని వెంటనే కేంద్రం తిరిగి చెల్లించాలి. అలాగే రూ. 55,548 కోట్లతో పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను వెంటనే ఆమోదించాలి. ప్రాజెక్ట్ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసే ఖర్చును 15 రోజుల గడువులోగా కేంద్రం చెల్లింపులు జరిపేలా పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందించాలి’ అని వైఎస్సార్‌సీపీ ఎంపీలు తమ విజ్ఞాపనపత్రంలో కోరారు.

జీఎస్టీ బకాయిల కింద రూ. 1605 కోట్లు వెంటనే విడుదల చేయాలి
జీఎస్టీ నష్టపరిహార బకాయిల కింద రాష్ట్రానికి రావాల్సిన  1605 కోట్ల రూపాయల బకాయిలను ఈ సందర్భంగా ఎంపీలు ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న మొత్తాన్ని వెంటనే చెల్లించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర  ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని..  బకాయిల చెల్లింపుల్లో అసాధారణ జాప్యం నెలకొంటే రాష్ట్ర ప్రభుత్వం అనేక  సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఈ నెల 18న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరుగుతున్నందున బకాయిలపై తక్షణమే చర్యలు తీసుకుని రాష్ట్రానికి రావలసిన 1605 కోట్ల రూపాయలను విడుదల చేయాల్సిందిగా మంత్రికి విజ్ఞప్తి చేశారు.

వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్‌ కింద 1050 కోట్లు ఇవ్వండి
రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఆరేళ్ళపాటు ప్రత్యేక సహాయం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఆ పద్దు కింద ఇప్పటి వరకు 1050 కోట్లు మాత్రమే విడుదల చేశారని.. మిగిలిన 1050 కోట్లను కూడా విడుదల చేయాలని కోరారు. కాగా యూపీ, మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌, ఒడిశాలోని కలహండికి ఇలాంటి ప్రత్యేక ప్యాకేజీ అమలు చేశారని.. ఆయా ప్రాంతాల్లోని తలసరి ఆదాయం ప్రాతిపదికన ప్యాకేజీ గ్రాంట్‌ను నిర్ణయించడం జరిగిందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. బుందేల్‌ఖండ్‌, కలహండి ప్రాంతాల్లో తలసరి ఆదాయం 4 వేల రూపాయలుగా లెక్కగట్టి ప్యాకేజీ అందించారని.. అదే ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన ప్రాంతాలకు తలసరి ఆదాయాన్ని కేవలం 400 రూపాయలుగా లెక్కించడం జరిగిందని తెలిపారు. నిర్హేతుకమైన ఈ ప్రాతిపదికను సరిదిద్దాల్సిందిగా మంత్రికి విజ్ఞప్తి చేశారు.

రెవెన్యూ లోటు గ్రాంట్‌ను సవరించాలి
‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అధికారులతో జరిపిన సమావేశంలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు గ్రాంట్‌ను సవరించడానికి కేంద్ర ప్రభుత్వ అధికారులు అంగీకరించారు. ఈ అంశానికి త్వరిగతిన పరిష్కారం కనుగొని రెవెన్యూ లోటు గ్రాంట్‌ కింద రాష్ట్రానికి రావలసిన రూ. 18,969 కోట్లను సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలి’అని ఎంపీలు విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు