విద్యార్థి తలపై ఊడిపడ్డ సీలింగ్‌ ఫ్యాన్‌..!

10 Jul, 2019 20:12 IST|Sakshi

న్యూఢిల్లీ : సర్కార్‌ బడుల్లో నాణ్యమైన విద్యనందిస్తామని చెప్పే ప్రభుత్వాలు.. ముందుగా మెరుగైన సౌకర్యాలు, నిరంతర పర్యవేక్షణపై దృష్టి పెట్టడం మంచిది. తరగతి గదిలో క్లాస్‌ నడుస్తుండగా.. ఓ విద్యార్థి తలపై అకస్మాత్తుగా ఫ్యాన్‌ ఊడిపడడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. త్రిలోక్‌పురిలోని సర్వోదయ బాలవిద్యాలయలో హర్ష్‌ (13) ఏడో తరగతి చదువుతున్నాడు. మంగళవారం టీచర్‌ ఫయాజ్‌ అహ్మద్‌ పాఠాలు చెప్తుండగా.. ఒక్కసారిగా సీలింగ్‌ ప్యాన్‌ ఊడి అతని తలపై పడింది. దీంతో తీవ్ర గాయాలతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. హుటాహుటిన అతన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. హర్ష్‌ స్పృహలోకి వచ్చాడని, అపాయమేమీ లేదని అతని మామ వెల్లడించారు. పాఠశాల నిర్లక్ష్య వైఖరిపై ఆయన మండిపడ్డారు.

‘హర్ష్‌కి ప్రమాదం జరిగిందని తెలియగానే.. స్కూల్‌ వద్దకు పరుగెత్తుకెళ్లాను. అతన్ని ఆస్పత్రికి తరలించాక.. స్కూల్లో పరిస్థితులు చూద్దామని అక్కడికి వెళ్లాను. కానీ, సిబ్బంది నన్ను లోనికి రానీయలేదు. పిల్లాన్ని మేమే ఆస్పత్రికి తరలించాం. ఇంతవరకు స్కూల్‌ నుంచి ఏ టీచరూ వచ్చి చూడలేదు. చాలీచాలని జీతంగా బతుకులు వెళ్లదీసే మాకు.. సాయం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ట్రీట్‌మెంట్‌కి అయ్యే ఖర్చు మాకు భారమే’అని వాపోయారు. ఫ్యాన్‌ అంతవరకూ బాగానే పనిచేసిందని, ఎలాంటి శబ్దం రాలేదని క్లాస్‌ టీచర్‌ ఫయాజ్‌ చెప్పారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా పిల్లాడి తలపై పడడంతో షాక్‌కు గురయ్యామని అన్నారు. ఇక ఈ ఘటనపై ఢిల్లీ బీజేపీ ప్రెసిడెంట్‌ మనోజ్‌తివారి మాట్లాడుతూ... పాఠశాల భవనాల నిర్మాణంలో అధికార ఆమ్‌ఆద్మీ పార్టీ భారీ కుంభకోణానికి పాల్పడిందని.. అందుకనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

మరిన్ని వార్తలు