మన కర్మలకి దేవుడు బాధ్యత వహించడా?

26 Jun, 2013 17:47 IST|Sakshi
మన కర్మలకి దేవుడు బాధ్యత వహించడా?
 కర్మణః పురుషః కర్తాశుభస్యా వ్యశుభస్యచ
 స్వఫలమ్ తదుపాననాతి కథమ్ కర్తాస్విదీశ్వరఃభావం: ఎవరు చేసిన కర్మఫలాన్ని వారనుభవించక తప్పదు. దానికి భగవంతుడు కర్త కాదు. కాకపోతే ప్రపంచంలో మంచిని పెంచాలని, క్రూరత్వాన్ని, దుర్మార్గాన్ని అంతం చేయాలనే ఉద్దేశ్యంతో భగవంతుడు కర్మని, పాపపుణ్యాలని, కర్మఫలాన్ని ఏర్పాటు చేసి ఉంటాడు. ఒక వ్యక్తి తన స్వార్థం కోరి, ఒక చెడు పని చేస్తే దాని ఫలితంగా అతనిలోని చైతన్యం సంకుచితం అయి, తద్వారా అజ్ఞానాంధకారం అలుముకుంటుంది. అదే నిస్వార్థంగా ఇతరుల మంచికోసం చేసిన కర్మల వల్ల అతనిలోని చైతన్యం విశాలం అయి తద్వారా జ్ఞానోదయం అవుతుంది. 
 
 మన కర్మలని దేవుడు ఎందుకు తొలగించడు? 
 ఒక పాప బొటనవేలిలో కట్టెపేడు దిగింది. ఆమె తండ్రి ఆ వేలిని చూసి, చికిత్స చేయడానికి బ్యాండ్ ఎయిడ్, ఆయింట్‌మెంట్, టింక్చర్ తె చ్చాడు. వేలిలోని ఆ పేడు ముక్కని తొలగించబోతే ఆ పాప ‘వద్దు నాన్నా, అది తీస్తే నొప్పి, అలాగే ఉంచి కట్టుకట్టు’ అంది. అయినా ఆ తండ్రి ఊరుకోలేదు. ఎందుకంటే ఆ
 
 పేడు బయటకి వచ్చేదాకా ఆ చిన్నారికి శాంతి ఉండదు కదా!  
 కష్టాలలో ఉన్నప్పుడు మనమంతా ఇలాగే ప్రవర్తిస్తాం. ఇక్కడ పేడు ముక్క దుష్కర్మ. దానిని వేలిలోంచి తీయడం కర్మఫలం. మనం చికిత్స వద్దు, పైన కట్టు కడితే చాలనుకుంటాం. నొప్పిపుట్టకుండా పేడు తొలగాలనుకుంటాం. కష్టం తొలగితే దుష్కర్మ అలాగే ఉండిపోతుంది. పేడు ముక్కని తీయవద్దంటే తండ్రి ఊరుకుంటాడా? అలాగే మనకి కష్టం తొలగి దుష్కర్మని అలాగే ఉండనీయమంటే దేవుడు ఊరుకోడు. కర్మఫలం కూడా అంతే? అది మన రక్షణకే అని గ్రహించాలి. జీవాత్మ రకరకాల దుష్కర్మలు చేస్తూ, దానికి శిక్షని అనుభవిస్తూ క్రమేపీ పవిత్రతని సంతరించుకుంటుంది.
 
 కర్మప్రయోజనం ఇదేనని అద్వైత వేదాంతుల నమ్మకం. కొందరంటారు. మనహృదయంలో ఉన్న దేవుడే మన చేత కర్మలు చేయిస్తున్నాడు కాబట్టి వాటి ఫలితాలు కూడా ఆయనకే చెందాలని, మరి కొందరు శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు’ అన్న సామెత ప్రకారం తాము చేసే ప్రతి కర్మనీ పరమాత్మ ఆజ్ఞతోనే  చేస్తున్నాం కాబట్టి వారి ఫలాలు కూడా ఆయనే అనుభవించాలని, అన్యాయంగా తామనుభవిస్తున్నామని అంటారు. అయితే ఇది నిజం కాదని, దేవుడికి మనకర్మలతో ఎలాంటి ప్రమేయం లేదని చెప్పడానికి పెద్దలు ఈ ఉదాహరణ చెబుతుంటారు...
 
 ఒక చిన్నగదిలో దీపం వెలుగుతోంది. కొందరు ఆ వెలుగులో భగవద్గీత చదువుకుంటున్నారు. మరికొందరు ఎవరివో చెక్కుల మీద దొంగసంతకాలు చేస్తున్నారు. భగవంతుడి కరుణ ఆ దీపం వంటిది. గీత చదివినవారు తరిస్తే, దొంగ సంతకాలు పెట్టినవాడు జైలుకి వెళ్లవచ్చు. తప్పు ఆ దీపానిదా? మన కర్మలఫలాలని అందించడంలో భగవంతుడు సాక్షీభూతుడు మాత్రమే. దేవుడు కర్మ ఫలప్రదాత మాత్రమే: భగవంతుడు బ్యాంకులో క్యాషియర్‌లాంటివాడు. అంటే మన చెక్కుకు తగినంత డబ్బే క్యాషియర్ ఇస్తాడు. అదీ అందుకు తగ్గ జమ ఉంటేనే. దేవుడు కూడా మన కర్మలను అనుసరించే మనకి ఫలాలని ఇస్తాడు.
 
 అంతే కానీ ఆ కర్మలకి ఆయన కారణం కాదు. వారి వారి సంస్కార బీజాల వల్ల మనుషులు దుష్కర్మలని చేసి దుఃఖాన్ని, సుకర్మలని చేసి సంతోషాన్ని అనుభవిస్తుంటారు. అయితే తాము కేవలం పుణ్యకర్మలని మాత్రమే చేస్తామని, అసలు పాపకర్మలు చేయనే చేయము అని చెప్పడం మనిషి లక్షణం. 
 
 ఒక్కోసారి ఎంత ప్రార్థించినా కష్టాల తీరవెందుకు? 
 మన కర్మబలం ముందు సర్వేశ్వరుడు కూడా మౌనం దాల్చవలసిందే. ఈ జన్మలో మనం అనుభవించాల్సి ఉన్న ప్రారబ్ధకర్మలన్నింటినీ  అనుభవించి తీరవలసిందే తప్ప వాటినుంచి మనకు విడుదల ఉండదు. కాబట్టి ఒక్కోసారి మనం ఎంత పెద్దమొక్కులు మొక్కుకున్నా, ఎన్ని పూజలు చేసినా ఏ దేవుడూ ప్రారబ్ధ కర్మలుగా వచ్చే ఆ కష్టాలని తీసేయలేడు. ప్రారబ్ధంలో లేని సుఖాలని ఇవ్వలేడు. అదేవిధంగా మన ప్రారబ్ధ కర్మల ప్రకారం ఆ కష్టం తీరడానికి ఇంకా కొంత సమయం ఉంటే మనం ఎంత పూజించినా ప్రయోజనం ఉండదు.  
 
 అయితే ఏ ప్రయోజనం లేదు కదా అని మనం సుకర్మలు చేయకుండా, భగవంతుని పూజించకుండా ఉండటం వల్ల ఆ కష్టాన్ని మరింతగా అనుభవించాల్సి ఉంటుంది. అందుకే రోగబాధని తగ్గించుకునేందుకు, ఉపశమనాన్ని పొందేందుకు ఔషధాన్ని క్రమం తప్పకుండా ఎలా వాడతామో అలా స్వాంతన కోసం మనం సర్వేశ్వరుణ్ణి సేవించాలి. దేవుడి ఆరాధన ద్వారా సంచితం లేదా ఆగామి కర్మలు నశించే అవకాశం కూడా ఉంది. రాబోయే జన్మల్లో అనుభవించాల్సిన కష్టనష్టాలని, రోగాలని ఈ విధంగా మనం మొక్కుల రూపేణా చేసే దైవారాధన ద్వారా రద్దు చేసుకోవచ్చు. 
 
  మన కర్మబలం ముందు సర్వేశ్వరుడు కూడా మౌనం దాల్చవలసిందే. ఈ జన్మలో మనం అనుభవించాల్సి ఉన్న ప్రారబ్ధకర్మలన్నింటినీ మౌనంగా అనుభవించి తీరవలసిందే తప్ప అంతకుముందు వాటినుంచి మనకు విడుదల ఉండదు.
 
 - మల్లాది వెంకట కృష్ణమూర్తి
 

 

>
మరిన్ని వార్తలు